ఐపీఎల్ 2026 ఆరంభ వేళ విరాట్ కోహ్లి ని ఓ సరికొత్త రికార్డు ఊరిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోని మైలురాయికి చేరువలో విరాట్ కోహ్లి ఉన్నాడు. ఈ సీజన్‌లో 339 పరుగులు చేస్తే ఎవ్వరూ అందుకోని ఆ రికార్డు కింగ్ సొంతం అవుతుంది. ఐపీఎల్‌లో మరో భారీ రికార్డుపై విరాట్ కోహ్లి కన్నేశాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోని 9000 పరుగుల మైలురాయికి కోహ్లి అతి దగ్గరలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 259 ఇన్నింగ్స్‌లలో 8661 పరుగులు చేశాడు. దీంతో 339 పరుగులు చేస్తే 9000 మార్క్‌ను అందుకుంటాడు. ఈ ఘనత సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో 9 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లి నిలుస్తాడు.ఐపీఎల్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగుల చేసిన ఆటగాళ్ల స్థానంలో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
కోహ్లి తర్వాత రోహిత్ శర్మ 7046 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 6769 పరుగులతో మూడు.. డేవిడ్ వార్నర్ 6565తో నాలుగు, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా 5528తో టాప్ 5లో ఉన్నాడు. వీరిలో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పగా.. రోహిత్, కోహ్లి మాత్రమే కొనసాగుతున్నారు.కోహ్లి ఇప్పటికే ఐపీఎల్‌లో అనేక రికార్డులు సృష్టించాడు. కింగ్ ఖాతాలో 8 సెంచరీలతో పాటు 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో 71 ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ చేసిన ఏకైక బ్యాటర్ కూడా కోహ్లీనే.
2016 సీజన్‌లో 973 పరుగులు చేసి ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు సృష్టించాడు. అదే సీజన్‌లో నాలుగు సెంచరీలు కూడా నమోదు చేయడం విశేషం. ఈ రికార్డును జోస్ బట్లర్ ఒక్కడే సమం చేశాడు.అంతేకాదు, 600కిపైగా పరుగులు ఐదు సీజన్లలో చేసిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీయే. 2013, 2016, 2023, 2024, 2025లో 600కు పైగా పరుగులు చేశాడు. 2016, 2024లో ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. అదేవిధంగా వికెట్ కీపర్ కాకుండా 118 క్యాచ్‌లు పట్టుకున్న రికార్డ్‌ను కూడా కోహ్లి తన పేరుపై నమోదు చేశాడు.ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.