పరువు కోసం కివీస్ పోరాటం… తుది జట్టులో కీలక మార్పులు…!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు న్యూజిలాండ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌ను గెలిచి భారత పర్యటనను ఘనంగా ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఐదు టీ20ల సిరీస్‌లో బిగ్ షాక్ తగిలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2026 | 10:00 PMLast Updated on: Jan 27, 2026 | 10:00 PM

New Zealand Fights For Pride Key Changes In The Final Squad

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు న్యూజిలాండ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌ను గెలిచి భారత పర్యటనను ఘనంగా ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఐదు టీ20ల సిరీస్‌లో బిగ్ షాక్ తగిలింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది.ఈ ఘోర పరాజయం నేపథ్యంలోనే న్యూజిలాండ్ టీమ్ ఇద్దరి ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి స్వదేశం పంపించింది. స్టార్ పేసర్ క్రిస్టియన్ క్లార్క్, బ్యాటర్ టీమ్ రాబిన్సన్‌లను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరి స్థానాల్లో జిమ్మీ నిషమ్, లాకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకుంది. త్రివేండ్రం వేదికగా జరిగే ఆఖరికి టీ20కి ఫిన్ అలెన్ కూడా అందుబాటులోకి వస్తాడని ట్వీట్ చేసింది.

24 ఏళ్ల క్రిస్టియన్ క్లార్క్ జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన క్లార్క్ 40 పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు. ఇదే మ్యాచ్‌లో టీమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు. రెండో టీ20లో ఈ ఇద్దర్ని పక్కనపెట్టి మ్యాట్ హెన్రీ, టీమ్ సీఫెర్ట్‌లను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దర్ని స్వదేశం పంపించారు.

బిగ్ బాష్ లీగ్ నేపథ్యంలో ఫిన్ అలెన్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డ్ ఫిన్ అలెన్ పేరిట ఉంది. బిగ్ బాష్ లీగ్‌లో 26 ఏళ్ల ఫిన్ అలెన్ పెర్త్ స్కార్చర్స్ తరఫున బరిలోకి దిగాడు. 11 మ్యాచ్‌ల్లో 466 పరుగులు చేశాడు. అతని రాకతో న్యూజిలాండ్ టీమ్ బలం పెరిగింది. ఇదిలా ఉంటే సిరీస్ క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకోవాలని పట్టుదలగా ఉన్న కివీస్ కు అది అంత సులభం కాదనే చెప్పాలి. ఎందుకంటే బ్యాటర్లు, బౌలర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతుండడమే దీనికి కారణం. ఏ మ్యాచ్ లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్న కివీస్ కు ఈ వైఫల్యాలు ప్రపంచకప్ కు ముందు కాస్త టెన్షన్ పెట్టే అంశంగానే చెప్పాలి.