Top story: రోహిత్ శర్మ రిటైర్ లార్డ్స్.. వన్డేతో ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసినట్టే..!

భారత క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా.. చారిత్రక లార్డ్స్ వేదికగా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నాడా.. ప్రపంచకప్ ప్రణాళికల్లో లేవంటూ సెలక్టర్లు చెప్పేసారా

Post Published By: dialnews
Updated : 18 July 2026, 9:56 AM IST

భారత క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా.. చారిత్రక లార్డ్స్ వేదికగా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నాడా.. ప్రపంచకప్ ప్రణాళికల్లో లేవంటూ సెలక్టర్లు చెప్పేసారా.. ప్రస్తుతం భారత క్రికెట్ లో ఇదే హాట్ టాపిక్. ఆదివారం ఇంగ్లాండ్ తో జరగబోయే మూడో వన్డేతో రోహిత్ రిటైర్ కానున్నట్టు జోరుగా సాగుతున్న వేళ అతని తల్లిదండ్రులు లండన్ చేరుకోవడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది.హిట్ మ్యాన్ గత కొంతకాలంగా పేలవ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ లోనూ నిరాశపరిచాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో తాను లేడన్న విషయాన్ని సెలక్టర్లు రోహిత్ కు స్పష్టం చేసినట్టు సమాచారం.

అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును నిర్మించాలని భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యశస్వి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. తుది నిర్ణయాన్ని మాత్రం రోహిత్ శర్మకే వదిలేసినట్టు ఆ కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఫామ్ కూడా పేలవంగా ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. అన్నింటికంటే వచ్చే ఏడాది చివరి వరకూ హిట్‌మ్యాన్ ఫిట్ నెస్ కాపాడుకోవడం కూడా సవాల్ గానే భావిస్తున్నారు.

తాజాగా రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తూ కొన్ని సంఘటనలు జరిగాయి. ఇంగ్లాండ్ తో రెండో వన్డేలో రోహిత్ , కోహ్లీ పక్కపక్కనే కూర్చున్నారు. గతంలో అశ్విన్ రిటైర్మెంట్ సమయంలోనూ కోహ్లీ అతని పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీటవడంతో హిట్ మ్యాన్ వీడ్కోలుపై వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ తల్లిదండ్రులు హఠాత్తుగా లండన్ చేరుకున్నారు. సాధారణంగా రోహిత్ ఆడే మ్యాచ్ లకు భార్య రితిక, పిల్లలు తప్పిస్తే తల్లిదండ్రులు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రోహిత్ పేరెంట్స్ ఇప్పుడు లండన్ చేరుకోవడంతో రిటైర్మెంట్ ఖాయమేనంటూ పలువురు అంచనా వేస్తున్నారు. టీమిండియా జెర్సీలో చివరిసారిగా తమ కుమారుడిని ప్రత్యక్షంగా చూసేందుకు వారు వచ్చారని భావిస్తున్నారు.

కాగా రోహిత్ శర్మకు ప్రపంచకప్ లో అద్భుతమైన రికార్డుంది. మెగాటోర్నీ అంటే చాలు పూనకం వచ్చినట్టుగా చెలరేగిపోతాడు. అలాంటి హిట్ మ్యాన్ ను ఇప్పుడు అదే ప్రపంచకప్ కు పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు సెలక్టర్ల నిర్ణయంపై హిట్ మ్యాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంకా కొనసాగుతానని చెప్పినట్టు, దీనికి సెలక్టర్లు నిరాకరించినట్టు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ లో టీ ట్వంటీ , టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. 2024లో భారత జట్టుకు కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందించిన తర్వాత ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. తర్వాత 2025లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఇప్పటి వరకూ 287 వన్డేలు ఆడిన రోహిత్ 11 వేలకు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్ ఇక టీమిండియాలో కనిపించడన్న వార్తను అభిమానులు జీర్చించుకోలేకపోతున్నారు.

Published : 
  • 18 July 2026, 9:56 AM IST