ఐపీఎల్ వస్తుందంటే చాలు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే అందరి చూపు ఉంటుంది. ఈ లీగ్ లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఆర్సీబీలో కీలక ప్లేయర్ గా ఉన్న విరాట్ ప్రతీ సీజన్ లో పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. తాజాగా ఆర్సీబీ జట్టుతో చేరిన విరాట్, తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు.
ముఖ్యంగా క్రీజులో ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్లతో దాడి చేశాడు. దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలను మాత్రమే ఆడుతున్న కింగ్ కోహ్లి.. ఇప్పుడు టీ20 ఫార్మాట్ కి తగ్గట్టుగా తన బ్యాటింగ్ ని ఛేంజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫాంలో కనిపిస్తున్నాడు. తను చివరగా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్ లలో అద్భుతంగా ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో మూడు మ్యాచులు ఆడిన కోహ్లి.. 151 సగటుతో 302 రన్స్ చేయగా.. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది అనంతరం న్యూజిలాండ్ పై కూడా తన ఫామ్ ని కొనసాగించి మూడు మ్యాచులలో 80 సగటుతో 240 పరుగులు చేశాడు.
ఇప్పుడు అదే జోరును త్వరలోనే ప్రారంభమయ్యే ఐపీఎల్ లో కూడా కంటిన్యూ చేసేందుకు కింగ్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. గత సీజన్లోనూ విరాట్ అసాధరణమైన ప్రదర్శన చేశాడు. 15 మ్యాచులు ఆడి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్ గా కొనసాగాడు. ఆర్సీబీ మొదటిసారి టైటిల్ గెలవడంలో కింగ్ దే కీలకపాత్ర. ఈ సారి కూడా కోహ్లి మరోసారి తన అద్భుత ప్రదర్శనలతో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకి ట్రోఫీని అందించాలని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ని మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో పోటీ పడనుంది.