ప్రపంచ క్రికెట్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదుల సమరంపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తోంది. క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో అయితే జనాలంతా టీవీలకు అతుక్కుపోతారు. పాకిస్థాన్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే భారత్, పాక్‌లు తలపడుతున్నాయి. దాంతో దాయాదుల సమరంపై మరింత ఆసక్తి పెరిగింది.ఈ మ్యాచ్ చుట్టూ వందల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఐసీసీ ప్రతీ మెగా టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందిస్తుంది. ఈ ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండేలా సీడింగ్ తీస్తోంది. అలాంటిది భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ జట్టును టోర్నమెంట్‌కు పంపేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రం ఆడవద్దని ఆదేశించింది. దీంతో ఐసీసీతో పాటు అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం భారత్–పాక్ టీ20 మ్యాచ్ విలువ సుమారు రూ.4,500 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. టీవీ ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ అమ్మకాల, బెట్టింగ్ లీగల్ గా ఉన్న దేశాల్లో దాని ద్వారా ఈ భారీ ఆదాయం వస్తుంది. ఈ మ్యాచ్ లేకపోతే, బ్రాడ్‌కాస్టర్లకు వందల కోట్ల రూపాయల నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. దీంతో వారు ఐసీసీ వద్ద నష్టపరిహారం కోరే అవకాశం కూడా ఉంది.బ్రాడ్‌కాస్టర్ల నుంచి వచ్చే ఒత్తిడితో ఐసీసీ ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న క్రికెట్ బోర్డులపై పడుతుంది. ఐసీసీ నుంచి వచ్చే నిధుల మీద ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బగా మారవచ్చు. ఈ వివాదంలో ఎక్కువ నష్టపోయే అవకాశం పాకిస్తాన్‌కే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్‌కు దూరంగా ఉంటే, పీసీబీకి ఐసీసీ చెల్లింపులు తగ్గే ప్రమాదం ఉంది. అలాగే జరిమానాలు, ఇతర శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. భారత్‌కు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా, పాకిస్తాన్‌కు మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే నిర్ణయంగా మారవచ్చని చెబుతున్నారు.
ఒక్క మ్యాచ్ బాయ్‌కాట్ చేయడం వల్ల పాకిస్తాన్ క్రికెట్‌పై దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉంది. బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు పాకిస్తాన్ మ్యాచ్‌లను భవిష్యత్‌లో రిస్క్‌గా భావించే పరిస్థితి రావచ్చు. దీంతో ప్రసార హక్కుల విలువ తగ్గడం, స్పాన్సర్‌షిప్‌లు తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. భారత్–పాక్ మ్యాచ్ కోసం ముందుగానే టికెట్లు కొనుగోలు చేసిన వారు, ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న వారు ఇప్పుడు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వరల్డ్‌కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో రాజకీయ అంశాలు ప్రభావం చూపడం క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో, పాకిస్తాన్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.