ఒక్క ఇన్నింగ్స్ తో హీరో విమర్శకుల నోళ్లు మూయించావ్ గా…!

సంజూ శాంసన్ .. 11 ఏళ్ల క్రితం భారత జెర్సీ ధరించి తొలిసారి బరిలోకి దిగాడు. అయితే ఇప్పటికే అతడికి తుది జట్టులో చోటుపై గ్యారంటీ లేదు.

Post Published By: dialnews
Updated : 3 March 2026, 12:15 PM IST

సంజూ శాంసన్ .. 11 ఏళ్ల క్రితం భారత జెర్సీ ధరించి తొలిసారి బరిలోకి దిగాడు. అయితే ఇప్పటికే అతడికి తుది జట్టులో చోటుపై గ్యారంటీ లేదు. నిలకడలేమి.. అతడికి ప్రధాన సమస్యగా మారింది. ఎంతో ప్రతిభావంతుడిగా పేరున్న శాంసన్.. చాలా మ్యాచ్‌ల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో కీలక ప్లేయర్లు లేనప్పుడే.. చిన్న జట్లతో మ్యాచ్‌లలో అతడికి తుది జట్టులో అవకాశం దక్కేది. సీనియర్లు రిటైర్ కావడంతో టీ20 ప్రపంచకప్ 2026లో అతడి ప్లేసుకు ఢోకా లేదని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన సంజూ శాంసన్ 46 పరుగులే నమోదు చేశాడు. ఇదే సమయంలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తాచాటడంతో.. టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లలో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. నమీబియాతో మ్యాచ్‌లో ఆడే అవకాశం వచ్చినా.. మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలవలేకపోయాడు. జింబాబ్వేతో మ్యాచ్‌నూ 22 రన్స్ మాత్రమే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు మళ్లీ తుది జట్టులోకి వస్తాడని ఎవరూ ఊహించలేదు.

కానీ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ కోసం ప్లేయింగ్ లెవెన్‌లోకి వచ్చాడు సంజూ. 196 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లు త్వరగానే పెవిలియన్ చేరినా.. సంజూ నిలబడ్డాడు. టీ20 స్పెషలిస్టులుగా పేరున్న సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ విఫమైనా.. పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. తనలోని ప్రతిభకు న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న సంజూ.. అసలైన మ్యాచ్‌లో సిసలైన ఆటను బయటకు తీశాడు. తనలోని షేర్‌ను ప్రపంచానికి చూపించాడు.ఈ రోజు తన రోజు అని భావించిన సంజూ.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి హీరో అయిపోయాడు. పేరు గుర్తుపెట్టుకోండి.. సంజూ శాంసన్ అని పొగిడే ప్రదర్శన చేశాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. నేనున్నానంటూ అభిమానులకు భరోసా ఇస్తున్నాడు.

Published : 
  • 3 March 2026, 12:15 PM IST