బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్, ఐసీసీ కీలక నిర్ణయం

టీ20 ప్రపంచకప్ కు ఇంకా రెండు వారాలే టైముంది. ఇప్పటికే అన్ని జట్లు తమ జాబితాను ప్రకటించేసి వరుస సిరీస్ లతో బిజీగా ఉన్నాయి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2026 | 12:20 PMLast Updated on: Jan 25, 2026 | 12:20 PM

Scotland Replaces Bangladesh Icc Makes A Key Decision

టీ20 ప్రపంచకప్ కు ఇంకా రెండు వారాలే టైముంది. ఇప్పటికే అన్ని జట్లు తమ జాబితాను ప్రకటించేసి వరుస సిరీస్ లతో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో భారత్ లో ఆడేది లేదంటూ నానా హడావుడి చేసిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఐసీసీ రీప్లేస్ మెంట్ పై ఫోకస్ పెట్టింది. ఊహించినట్టుగానే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశమిచ్చింది. ర్యాంకింగ్స్ ప్రకారం ముందు నుంచీ స్కాట్లాండ్ పేరే వినిపించగా.. ఇప్పుడు ఖారారైంది. గ్రూప్ సిలో ఉన్న బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఆ స్థానంలోనే స్కాట్లాండ్ కు చోటు దక్కింది. గత ఏడాది క్వాలిఫికేషన్ రౌండ్ లో అద్భుతంగా ఆడినప్పటకీ ఒకే ఒక్క ఓటమితో టీ20 ప్రపంచకప్ బెర్త్ చేజార్చుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మెగాటోర్నీని బాయ్ కాట్ చేయడంతో అవకాశాన్ని చేజిక్కించుకుంది.

నిజానికి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండ, దాడులు ఈ మొత్తం వ్యవహారానికి కారణమయ్యాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడించొద్దని డిమాండ్ వ్యక్తమవడంతో బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన ముస్తాఫిజుల్ రహమాన్ ను రిలీజ్ చేయాలని కేకేఆర్ ను ఆదేశించింది. దీంతో ముస్తఫిజుర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న కోల్ కత్తా మరో ప్లేయర్ ను తీసుకుంది. అయితే దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశ క్రికెట్ బోర్డును రెచ్చగొట్టింది. భారత్ లో వరల్డ్ కప్ ఆడమంటూ ఐసీసీకి లేఖ రాయించింది. తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని కోరింది. దీనికి ఐసీసీ అంగీకరించలేదు.

షెడ్యూల్ , లాజిస్టిక్స్ వంటి వాటిలో సమస్యలు ఎదురవుతాయని, వేదికను మార్చడం కుదరదని పేర్కొంది. భద్రతా పరంగా బంగ్లాదేశ్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ప్రతీకార చర్యలకే ప్రాధాన్యతనిచ్చింది. ఐర్లాండ్ తో గ్రూప్ మార్చాలని కొత్త డిమాండ్ తీసుకొచ్చినా కూడా ఐసీసీ అంగీకరించలేదు. ఆడితే భారత్ లో ఆడండి లేకుంటే లేదని తేల్చి చెప్పేసింది. ఫలితంగా బంగ్లాదేశ్ తాము ప్రపంచకప్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందు నుంచీ అనుకున్నట్టుగానే స్కాట్లాండ్ టీమ్ తో బంగ్లా ప్లేస్ ను భర్తీ చేశారు. ఇదే గ్రూపులో నేపాల్ , ఇటలీ, వెస్టిండీస్, ఇంగ్లాండ్ కూడా ఉన్నాయి.