ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూప్-బీలో భాగంగా పల్లెకెలె వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. ఒమన్ తేలిపోయింది. కనీస పోటీనివ్వలేకపోయింది. ఈ విజయంతో గ్రూప్-బీ నుంచి సూపర్ -8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఒమన్ ఇంటిబాట పట్టేందుకు సిద్దమైంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ 45 బంతుల్లో 7 ఫోర్లతో 61, పవన్ రత్నాయక 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 60, డసన్ షనక 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 హాఫ్ సెంచరీలతో రాణించారు. ఒమన్ బౌలర్లలో జితెన్ రెండు వికెట్లు తీయగా.. ఒడెడ్రా, సుఫ్యాన్ మెహ్‌మూద్ చెరో వికెట్ తీసారు.
అనంతరం ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మొహమ్మద్ నదీం మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు. నదీం కాకుండా వసీం అలీ ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఒమన్ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయసు 43 ఏళ్ల 161 రోజులు. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది.
జయసూర్య 2009 ప్రపంచకప్ ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత్ చమీరా, మహీష్ తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలేగే, దుషన్ హేమంత, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో శ్రీలంక గ్రూప్-బీలో టాపర్‌గా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా... జింబాబ్వే మూడో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన ఐర్లాండ్, ఒమన్ సూపర్-8 రేసు నుంచి తప్పుకుంది.