భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విన్నర్ కీర్తి ఆజాద్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం అన్యాయమని, ప్రతీ విషయాన్ని భూతద్దంతో చూస్తూ అనవసర వివాదాలు సృష్టించడం సరికాదన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయానంతరం ట్రోఫీని గంభీర్, జైషా, సూర్య స్టేడియంలోని హనుమాన్ ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేశారు.
ఐసీసీ ట్రోఫీని హనుమాన్ ఆలయంలోకి తీసుకుపోవడాన్ని కీర్తి ఆజాద్ తప్పుబడుతూ.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించాడు. ఇది భారత జట్టుకు అవమానకరమని మండిపడ్డాడు. టీమిండియా ఏమైనా సూర్యకుమార్ యాదవ్, జైషా సొత్తా?అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తాము ప్రపంచ కప్ గెలిచినప్పుడు.. జట్టులో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు ఉన్నారనీ, ఆ ట్రోఫీని మా మాతృభూమి అయిన హిందుస్థాన్‌కు తీసుకువచ్చామన్నాడు. కానీ ఇప్పుడు భారత్ గెలిచిన ట్రోఫీని ఇలా ఒక మతానికి ఎలా అంటగడుతున్నారంటూ ప్రశ్నించాడు.
మసీదు, చర్చి, గురుద్వారాకు ఎందుకు తీసుకెళ్లలేదునీ,.ఈ జట్టు భారత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నాడు. ఈ జట్టు ఏం సూర్యకుమార్ యాదవ్, జైషా కుటుంబానిది కాదన్నాడు. ఈ ట్రోఫీ భారత్‌లోని 140 కోట్ల జానాభాకు చెందుతుందనీ, ఇది కేవలం ఒక్క మతానికి చెందిన విజయ యాత్ర కాదని కీర్తి ఆజాద్ ట్వీట్ చేశాడు. కీర్తి అజాద్ వ్యాఖ్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలకు స్పందించడం కూడా అనవసరమని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు తమకు ఇష్టమైన రీతిలో సంబరాలు చేసుకుంటారని స్పష్టం చేశాడు. ఈ గెలుపు యావత్ భారత్‌కు పండుగలాంటిదన్నాడు. 15 మంది ఆటగాళ్లు పడ్డ కష్టాన్ని, వాళ్లు సాధించిన గొప్ప విజయాన్ని మనం తక్కువ చేయకూడదని గంభీర్ స్పష్టం చేశాడు.