ప్రపంచకప్ బహిష్కరణ నిర్ణయం ,బంగ్లా బోర్డుకు రూ.240 కోట్ల నష్టం
భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని తేల్చేసింది.
భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని తేల్చేసింది. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీబీ ప్రకటించింది. దాంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగేందుకు లైన్ క్లియరైంది. త్వరలోనే ఈ వ్యవహారంపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయనుంది.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనాలోచిత నిర్ణయంతో ఆ దేశ క్రికెట్ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఒత్తిడితో తీసుకున్న ఈ నిర్ణయంతో బీసీబీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లనుంది.ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే ఆ దేశ బోర్డు రూ. 240 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కరెన్సీలో ఇది దాదాపు రూ.325 కోట్లతో సమానం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ సభ్య దేశాలకు ఏటా ఇచ్చే ఆదాయ వాటాలో బంగ్లాదేశ్‌కు రావాల్సిన మొత్తాన్ని నిలిపేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆదేశ క్రికెట్ బోర్డును స్తంభింపజేసే ప్రమాదం ఉంది.
ఐసీసీ నుంచి రావాల్సిన బ్రాడ్ కాస్టింగ్ ఆదాయంలోని వాటాతో పాటు మొత్తం 60 శాతం ఆదాయాన్ని కోల్పోనుంది. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలను బహిష్కరిస్తే ఆ జట్టు స్పాన్సర్లు కూడా తప్పుకోనున్నారు. ఇది ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్థిక స్థితిని దెబ్బతీయనుంది.బంగ్లాదేశ్ తాజా నిర్ణయంతో ఆగస్ట్, సెప్టెంబర్‌లో భారత్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దు కానుంది. ఈ సిరీస్ ద్వారా బీసీబీకి బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉండేది. ఇతర జట్లతో 10 మ్యాచ్‌లు ఆడటం ద్వారా వచ్చే ఆదాయం భారత్‌తో జరిగే ఒక సిరీస్‌లోనే లభిస్తుంది. ఇప్పుడు అది కూడా బంగ్లా క్రికెట్ బోర్డు కోల్పోనుంది.బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారుడు ఆసిఫ్ నస్రుల్ భారత్‌కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఈ విషయమై మాజీ క్రికెటర్లు అతన్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. సీనియర్ ఆటగాళ్లెవరూ ఈ వ్యవహారంపై మాట్లాడటం లేదు. ముఖ్యంగా తమీమ్ ఇక్బాల్ వంటి గొప్ప ఆటగాళ్లకే గౌరవం దక్కని పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని వారు భావిస్తున్నారు.
ప్రపంచకప్ ఆడకపోయినా.. ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు డబ్బు ఒక్కటే లక్ష్యం కాదు. ప్రపంచ వేదికపై తమ నైపుణ్యాలను నిరూపించుకోవడమే ముఖ్యం. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లా ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయ కారణాలతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం .. ఆ దేశ క్రికెట్‌ను చాలా ఏళ్ల పాటు వెనక్కి నెట్టివేస్తుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.











