ఈ సారి అందరూ భారత కెప్టెన్లే… ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం…!

ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 6 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

Post Published By: dialnews
Updated : 24 March 2026, 2:10 PM IST

ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 6 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు సన్నాహకాలు మొదలుపెట్టాయి. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా 10 ఫ్రాంచైజీలు భారత కెప్టెన్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇలా భారత సారథులతో ఒక సీజన్ ప్రారంభం కావడం 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. పేరుకు ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అయినా.. విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తుది జట్టులో ఆడేది నలుగురే అయినా.. విదేశీ ఆటగాళ్ల ప్రభావం ఈ లీగ్‌పై ఎక్కువగానే ఉంటుంది.పలువురు విదేశీ ఆటగాళ్లు కెప్టెన్ల‌గా కూడా వ్యవహరించారు. కానీ గత 18 సీజన్ నుంచి ఉన్న ఒరవడికి ఈసారి మాత్రం తెరపడింది. తొలిసారి భారత ఆటగాళ్ల సారథ్యంలో 10 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. పలువురు విదేశీ కెప్టెన్లు గాయపడటంతో ఇది సాధ్యమైంది.సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మోకాలి గాయంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను తాత్కలిక సారథిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నియమించింది.

మిగతా 9 జట్లకు భారత ఆటగాళ్లే సారథులుగా ఉండటంతో.. ఈ సీజన్‌లో విదేశీ ఆటగాడు కెప్టెన్‌గా లేకుండా పోయాడు.19వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు రజత్‌ పాటీదార్‌... ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్‌ పటేల్‌... గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు శుబ్‌మన్‌ గిల్‌... కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు అజింక్య రహానే... రాజస్తాన్‌ రాయల్స్‌కు రియాన్‌ పరాగ్‌... ముంబై ఇండియన్స్‌కు హర్దిక్‌ పాండ్యా... పంజాబ్‌ కింగ్స్‌కు శ్రేయస్‌ అయ్యర్‌... లక్నో సూపర్‌ జెయింట్స్‌కు రిషభ్‌ పంత్ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీసీసీఐ కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది.

Published : 
  • 24 March 2026, 2:10 PM IST