ఇండియా, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 5 రోజుల్లో టోర్నీ అధికారికంగా ప్రారంభం కానుంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. అదే రోజు సాయంత్రం టీమిండియా తమ తొలి మ్యాచ్ లో యూఎస్ఏ తో ఆడుతుంది. అంతకంటే ముందు అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లతో బిజీ కానున్నాయి. సోమవారం నుంచి ఫిబ్రవరి 6 వరకు వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 5 రోజుల పాటు 15 మ్యాచ్ ల షెడ్యూల్ ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు వార్మప్ మ్యాచ్ లు టీమిండియా ఆడాల్సి ఉంది. ఇండియా ఫిబ్రవరి 4 న సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.
ఇండియా వరల్డ్ కప్ లో ఆడబోయే లీగ్ మ్యాచ్ కు మూడు రోజుల ముందు డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అమెరికా, నమీబియాలతో జరగబోయే వార్మప్ మ్యాచ్ ల కోసం సీనియర్ జట్టు కాకుండా ఇండియా 'ఏ' జట్టు ఆడనుంది. భారత ఏ జట్టుకు బదోనీ కెప్టెన్సీ చేయనున్నాడు. స్క్వాడ్ లో తిలక్ వర్మను కూడా ఎంపిక చేశారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తిలక్ వర్మ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సిన అవసరం ఉందని భావించిన సెలక్టర్లు ఈ తెలుగు కుర్రాడికి స్క్వాడ్ లో అవకాశం ఇచ్చారు. నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ఉర్విల్ పటేల్, పరాగ్ జట్టులో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.
ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన రవి బిష్ణోయ్ ని ఎంపిక చేశారు. మానవ్ సుతార్, విప్రజ్ నిగమ్ రూపంలో ఇద్దరు స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్లు ఉన్నారు. గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ లతో పేస్ విభాగాన్ని ఎంపిక చేశారు. ఇండియా ఎ ఫిబ్రవరి 2 న అమెరికాతో.. ఫిబ్రవరి 6న అమెరికాతో తలపడుతుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఎటువంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడవు. పాకిస్తాన్, న్యూజిలాండ్ ఒక్కొక్క వార్మప్ మ్యాచ్ ఆడతాయి. ఇటీవలే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ముగించుకున్న టీమిండియా నాలుగు రోజుల తర్వాత సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్ కప్ లో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న యూఎస్ఏ తో ఆడనుంది.