అభిషేక్ పై వేటు పడనుందా ? తుది జట్టులో మార్పులు…!

దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీమిండియా యాజమాన్యం మేల్కొంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయం మాత్రమే కాదు.

Post Published By: dialnews
Updated : 24 February 2026, 1:25 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీమిండియా యాజమాన్యం మేల్కొంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయం మాత్రమే కాదు.. భారత్ సెమీఫైనల్ ఆశలను కూడా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌ల కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు చేసేందుకు గౌతమ్ గంభీర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడుపు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన అభిషేక్ శర్మ.. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లో కనీసం ఖాతా తెరవలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులోనూ కేవలం 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ స్థానంలో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

ప్రస్తుతం భారత టాపార్డర్ అంతా ఎడమచేతి వాటం బ్యాటర్లతోనే నిండిపోయింది. ఇది ప్రత్యర్థి జట్ల స్పిన్నర్లకు వరంగా మారుతోంది. ఈ ఏకపక్ష బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని కోచింగ్ స్టాఫ్ భావిస్తోంది. సంజూ శాంసన్ ను తీసుకునే విషయంపై రానున్న రెండు రోజుల్లో చర్చిస్తామని సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే చెప్పాడు. కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాదు.. తిలక్ వర్మ, రింకూ సింగ్ ప్రదర్శనలపై కూడా మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో కనీసం ఒకరిని పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ హిట్టర్‌గా పేరున్న రింకూ సింగ్ దక్షిణాఫ్రికాపై డకౌట్ అవ్వడం టీమిండియా మిడిలార్డర్ బలహీనతను బయటపెట్టింది.

భారత్ తన తదుపరి మ్యాచ్‌లను జింబాబ్వే, వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. నిజానికి సౌతాఫ్రికాపై భారత్ ఆలౌట్ కాకుండా ఉన్నా, లేకపోతే తక్కువ మార్జిన్‌తో ఓడిపోయినా ఇంత టెన్షన్ ఉండేది కాదు. 76 పరుగుల తేడాతో ఓడిపోవడం, ఆలౌట్ కావడం, 20 ఓవర్లు ఆడకపోవడంతో భారత్ నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. సూపర్ 8లో భారత్ రన్‌రేట్‌ను ఒకసారి పరిశీలిస్తే -3.80గా పడిపోయింది.రెండు మ్యాచ్‌లలో భారత్ గెలిచినా.. ఏదో ఒక మ్యాచ్‌లో మాత్రం భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. మొత్తానికి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ ఆశలతో ప్రయాణం మొదలుపెట్టిన భారత్.. సూపర్ 8‌లో పెద్ద గండాన్నే దాటాల్సి ఉంది. ఈ క్రమంలో గంభీర్ మార్క్ 'అగ్రెసివ్' నిర్ణయాలు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Published : 
  • 24 February 2026, 1:25 PM IST