టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా నియమితులయ్యాడు. భారత దేశవాళీ క్రికెట్‌లో 'రెడ్ బాల్' ఫార్మాట్‌లో దిగ్గజంగా పేరుసంపాదించిన జాఫర్.. వచ్చే రెండేళ్ల పాటు హైదరాబాద్ జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నాడు. ఇటీవలే అంబటి రాయుడును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా నియమించింది. తాజాగా అనుభవజ్ఞుడైన జాఫర్‌ను మెంటర్‌గా తీసుకుంది. అయితే.. రాయుడు ప్రోద్భలంతోనే జాఫర్‌ను ఈ పదవికి ఎంపిక చేసినట్టు సమాచారం.దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు వసీం జాఫర్ 1996 నుంచి 2020 వరకు సాగిన తన అద్భుతమైన 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అతడు అధిగమించాడు. 260 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 50.67 సగటుతో 19,410 పరుగులు సాధించాడు. ఇందులో 57 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే, రంజీ ట్రోఫీ చరిత్రలో 238 ఇన్నింగ్స్‌లలో 12,038 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా జాఫర్ తన పేరిట లిఖించుకున్నాడు.48 ఏళ్ల జాఫర్ భారత్ తరపున 31 టెస్టులు ఆడాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సహా.. 1,944 పరుగులు ఉన్నాయి. జాఫర్‌కు కోచింగ్‌లో అనుభవం ఉంది. అతడు పంజాబ్, ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. గత సీజన్‌లో విదర్భ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సేవలందించాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్ అండర్-19 జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు.
2019-23 వరకు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. మరోవైపురెండుసార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ జట్టు ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో తన ప్రాభవాన్ని కోల్పోయింది. 2025-26 రంజీ ట్రోఫీలో హైదరాబాద్.. ఎలైట్ గ్రూప్-డిలో నాలుగో స్థానంలో నిలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 పోటీలో, ఎలైట్ గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ సూపర్ లీగ్ గ్రూప్-బిలో రెండో స్థానం నిలిచి, ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. విజయ్ హజారే ట్రోఫీలో, హైదరాబాద్.. గ్రూప్-బిలో ఆరో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది.