కాకినాడ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద ఘటనలో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? చనిపోవడానికి ముందే ఆ ఇంజినీర్ రాసిన వీలునామాలో ఏముంది? నదిలో దూకే ముందు ఆ తల్లి తన కొడుకుతో చెప్పిన చివరి మాటలు ఏంటి? అసలు ఈ కథలో ఉన్న 'సాదిక్ ఖాన్' ఎవరు?
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొద్దీ నూకరాజు కుటుంబాన్ని సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఎంత దారుణంగా వేధించాడో స్పష్టమవుతోంది. ఆత్మహత్యకు రెండు నెలల ముందే నూకరాజు స్వయంగా సాదిక్ ఖాన్ ఇంటికి వెళ్లాడట. 'ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది.. ఇకనైనా మా కుటుంబాన్ని వేధించడం ఆపేయ్ బాబు' అంటూ కాళ్ళు పట్టుకోనంత పని చేస్తూ వేడుకున్నట్లు సమాచారం. సాదిక్ వేధింపుల వల్ల తమ ఇంట్లో కనీసం మనశ్శాంతి కూడా లేకుండా పోతోందని, తమ ఇంటి వైపు రావద్దని సాదిక్ తల్లిని కూడా నూకరాజు బతిమాలాడు. అతని తల్లి కూడా కొడుకును మందలించినప్పటికీ.. సాదిక్ ఖాన్ మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. నూకరాజు కుటుంబాన్ని నిరంతరం వేధిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నూకరాజు కుటుంబం చనిపోయిన తర్వాత సాదిక్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే ఈ ఆత్మహత్య అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని.. నూకరాజు ముందే పక్కా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందే నూకరాజు ఒక వీలునామా రాసి పెట్టారు. ఆ వీలునామాలో తమకున్న స్థిర, చరాస్తులను ముగ్గురి పేరున రాశారు. అందులో నూకరాజు సోదరితో పాటు, మరో ఇద్దరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడో విచిత్రమైన, బాధాకరమైన విషయం ఏంటంటే.. తమతో పాటే చనిపోతాడనుకున్న మనవడు కార్తికేయ పేరు మీద నూకరాజు ఎలాంటి ఆస్తి రాయలేదు. మనవడిని కూడా తమతో పాటే తీసుకుపోవాలని వారు ముందే మానసికంగా సిద్ధమయ్యారని ఈ వీలునామా ద్వారా అర్థమవుతోంది.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును ఛేదించడానికి డిజిటల్ ఆధారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గత రెండు నెలల కాలంలో నిందితుడు సాదిక్ ఖాన్ ఫోన్‌కాల్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ పోలీసులు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు. అతనితో ఎవరెవరు టచ్‌లో ఉన్నారు..? ఎవరైనా ఈ వేధింపులకు సహకరించారా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా, నూకరాజు కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల లావాదేవీలను కూడా పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇక పరారీలో ఉన్న సాదిక్ ఖాన్ ఆచూకీ తెలిపిన వారికి 'రివార్డ్' ఇస్తామని సామాజిక మాధ్యమాల్లో పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తుండటం ఈ కేసు ఎంత సీరియస్‌గా మారిందో చెప్తోంది.
ఈ కేసులో అత్యంత హృదయవిదారకమైన ఘట్టం ఏంటంటే.. నదిలో దూకడానికి ముందు జరిగిన సంఘటన. నూకరాజు భార్య సౌజన్య నదిలోకి దూకే కొన్ని క్షణాల ముందు తన కుమారుడు కార్తికేయతో ఒక మాట చెప్పింది. 'నీకు ఈత వచ్చు కదా.. ఒకవేళ నువ్వు బతికి బయటపడితే.. ఫలానా ఆంటీ వద్దకు వెళ్ళు' అని ఒక మహిళ పేరు చెప్పిందట. కార్తికేయ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఆ మహిళ ఎవరు? ఈ కుటుంబానికి ఆమెతో ఉన్న సంబంధం ఏంటి? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో పోలీసులు ఆమె కోసం కూడా గాలిస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారి కుటుంబం ఇలా వేధింపులు తట్టుకోలేక నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. బతికి బయటపడిన ఆ చిన్నారి కార్తికేయ ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరి సాదిక్ ఖాన్ దొరికితే గానీ ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నిజాలు బయటపడవు.