తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పు మీద తప్పు చేస్తున్నారా? ముందు ఒకటి మాట్లాడి... తర్వాత మరొకటి మాట్లాడి, ఒక పొరపాటుని కవర్ చేసుకోవడానికి మరో పొరపాటు చేసి.... చివరికి వ్యవహారంలో తామే తప్పు చేశామనే భావన ప్రజల్లో కలిగించారా? నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని వాస్తవంలా చెప్పకుండా.... కొంత అతి చేసి చివరికి అసలుకే మోసం తెచ్చుకున్నారా?2024 జూన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ నెయ్యి వ్యవహారం బయటపడింది . అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణాతి దారుణంగా 11 సీట్లకే పరిమితం అయిపోయిన వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ని కల్తీ నెయ్యిని అడ్డంపెట్టి రాజకీయ సమాధి చేసేద్దాం అనుకున్నారు చంద్రబాబు.... పవన్. దీంతో చెలరేగి మాట్లాడారు.పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి , లడ్డు నెయ్యి కల్తీ జరగడం సనాతన ధర్మంపై దాడేనని ఆరోపిస్తూ ఆలయాల మెట్లు కడుగుతూ..... స్పెషల్ కాస్ట్యూమ్స్ లో సభలు నిర్వహించారు.
తిరుమల నెయ్యి కల్తీపై సి.బి.ఐ సిట్ దర్యాప్తు జరిపింది. అరెస్టులు చేసింది. కొందరు దగ్గర నుంచి డబ్బు స్వాధీనం చేసుకుంది. చివరికి సి.బి.ఐ చార్జీ షీట్లో నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని చెప్తూనే... చివర్లో నెయిలో జంతు కళేబరాల కొవ్వు లేదని రాసుకువచ్చింది. జంతుకళేబరాల కొవ్వు ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని సిబిఐ చెప్పింది. దానిని వెంటనే వైసీపీ అందిపుచ్చుకుంది. కల్తీ జరిగిన మాట వాస్తవమేనని చార్జిషీట్ మొదట్లో సిబిఐ చెప్పిన మాటని పక్కనపెట్టి... జంతు అవశేషాల కొవ్వు లేదనే విషయాన్ని హైలెట్ చేసి , చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోపణ అబద్ధమని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. అది జనంలోకి బాగా పోయింది.ఈ విషయంలో ఆలస్యంగా కళ్ళు తెరిచిన చంద్రబాబు.... వైసిపి ప్రచారాన్ని సమర్థంగా అడ్డుకోలేకపోయారు. లడ్డులో జంతుకొవ్వు లేదంటూ సిబిఐ చెప్పిందని, వైసిపి జనంలోకి త్వరగా ఆ ప్రచారాన్ని తీసుకెళ్లగలిగింది. కూటమి నేతలు వెంటనే దాన్ని సమర్థంగా తిప్పి కొట్టలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు కూటమి నేతలు అందరితో సమావేశం పెట్టి.... ఒక భారీ జాయింట్ ప్రెస్ మీట్ కూడా పెట్టిన... వైసిపి ప్రచారాన్ని నిలువరించలేకపోయారు. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు ఉంది అని ఆన్ రికార్డ్ బాబు ,పవన్ లోకేష్ చెప్పడంతో .... ఇప్పుడు ఇరుకున పడ్డారు. వెంటనే చంద్రబాబు మాట మార్చి బాత్రూంలు శుభ్రం చేసే కెమికల్ లడ్డు నెయ్యిలో వాడారంటూ.... కొత్త వాదన లేవనెత్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి దీంతో సంబంధం లేదని మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేసి పడేశారు.
ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి పబ్లిక్ లో నమ్మకాన్ని పోగొట్టుకున్నారూ.లడ్డుని అడ్డంపెట్టి జగన్ని ,వైసీపీని అధపాతాలోకానికి తొక్కలన్న ఆత్రుతలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గడికో మాట మాట్లాడి.... జనం దృష్టిలో చులకన అయిపోయారు.తిరుమల లడ్డు నెయ్యిలో జంతు అవశేషాల కొవ్వు ఉందా ? లేక బాత్రూములు కడిగే కెమికల్ ఉందా? రెండు ఒకే మనిషి చెప్తే జనం ఎలా నమ్ముతారు? ఇంత సీనియర్ పొలిటీషియన్.... అడ్మినిస్ట్రేటర్ ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని గట్టిగా చెప్పలేకపోగా.... ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన వినిపించి జనంలో గందరగోళం సృష్టించారు.దీనికి తోడు టిడిపి మీడియా ఏదేదో మాట్లాడి ఇంకొంత అయోమయం సృష్టించింది. చివరికి జనం అంతా లీడర్లు అందరూ కలిసి తిరుమలను భ్రష్టు పట్టించారు కదరా అని నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.