బ్యూటీ విత్ బ్రెయిన్స్.. గ్లామర్‌తో పాటు గ్రామర్ కూడా ముఖ్యమే..!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావాలంటే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అనే నానుడి ఉండేది. చాలామంది నటీమణులు కెరీర్ కోసం తమ చదువును మధ్యలోనే ఆపేసేవారు

Post Published By: dialnews
Updated : 12 February 2026, 6:54 PM IST

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావాలంటే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అనే నానుడి ఉండేది. చాలామంది నటీమణులు కెరీర్ కోసం తమ చదువును మధ్యలోనే ఆపేసేవారు. కానీ నేటి తరం యువ హీరోయిన్లు ఆ పాత రికార్డులను చెరిపేస్తున్నారు. అటు షూటింగ్స్.. ఇటు స్టడీస్ అంటూ రెండు పడవల ప్రయాణాన్ని ఎంతో బ్యాలెన్స్డ్ గా సాగిస్తున్నారు. కేవలం వెండితెరపై అందం ఆరబోయడమే కాదు, రియల్ లైఫ్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే, అకడమిక్ గా గోల్డ్ మెడల్స్ సాధిస్తూ నేటి యువతకు రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల ఈ ట్రెండ్ కు బెస్ట్ ఉదాహరణ. వరుస సినిమాలతో నిమిషం తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ఆమె ఇటీవల తన MBBSను పూర్తి చేసి డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు.

షూటింగ్ గ్యాప్ లో కారవాన్ లో కూర్చుని ఆన్ లైన్ క్లాసులు వింటూ, సెట్ లోనే పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఆమె ఈ ఘనత సాధించారు. శ్రీలీల బాటలోనే మీనాక్షి చౌదరి కూడా డెంటిస్ట్ BDS కోర్సు పూర్తి చేశారు. ఇక అందరి కన్నా ముందుగా ఈ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం సాయి పల్లవి. ఆమె జార్జియాలో మెడిసిన్ పూర్తి చేసి, డాక్టర్ అయ్యాకే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు. రాజశేఖర్ కూతురు శివాని కూడా డాక్టరే. కేవలం డాక్టర్లే కాదు, లాయర్లు, ఇంజనీర్లు, సైకాలజీ స్టూడెంట్లు కూడా ఇప్పుడు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై 'బలగం', 'మసూద' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్ పుణెలోని ప్రముఖ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆమె కోర్టులో వాదించగల సత్తా ఉన్న అడ్వకేట్ కూడా.

ఇక ఉప్పెన బ్యూటీ 'కృతి శెట్టి' ప్రస్తుతం సైకాలజీ చదువుతుంటే.. శివాత్మిక రాజశేఖర్ ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా కొనసాగుతున్నారు. ఇలా ఎవరికి నచ్చిన సబ్జెక్టులో వారు ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అంటేనే రాత్రి పగలు తేడా లేకుండా ఉంటాయి. అలాంటిది ఈ హీరోయిన్లు చదువును కొనసాగించడం సామాన్యమైన విషయం కాదు. పరీక్షల సమయంలో షూటింగ్స్ కు బ్రేక్ తీసుకోవడం, ఫ్లైట్ జర్నీలలో పుస్తకాలు చదవడం వంటివి వీరికి అలవాటు. అయినా సరే చదువు అందించే ఆత్మవిశ్వాసం వేరు అని వీరు బలంగా నమ్ముతున్నారు. సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అని, అక్కడ శాశ్వతమైన కెరీర్ ఉండకపోవచ్చని గ్రహించిన వీరు, చదువును ఒక బలమైన బ్యాకప్ ప్లాన్ గా, తమ వ్యక్తిత్వ వికాసానికి ఒక మెట్టుగా భావిస్తున్నారు.

మొత్తానికి టాలీవుడ్ హీరోయిన్ల నిర్వచనం మారుతోంది. కేవలం అందం ఉంటే చాలు అనుకునే రోజులు పోయి, తెలివితేటలు, విద్యాార్హతలు కూడా ముఖ్యమే అనే రోజులు వచ్చాయి. శ్రీలీల, కావ్య, సాయి పల్లవి వంటి వారు నిరూపిస్తున్నది ఒక్కటే.. మనసుకు నచ్చిన పని చేస్తూనే, మెదడుకు మేత వేసే చదువును నిర్లక్ష్యం చేయకూడదు. వీరి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత మంది ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చి, తెలుగు సినిమా స్థాయిని పెంచుతారని ఆశించవచ్చు.

Published : 
  • 12 February 2026, 6:54 PM IST