టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు మైండ్ గేమ్స్ మొదలయ్యాయి. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఓ ఆసక్తికరమైన సవాల్ విసిరాడు. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గత నమీబియా మ్యాచ్కు ముందు కడుపులో నొప్పి కారణంగా దూరమయ్యాడు. అయితే పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాత్రం అభిషేక్ కోలుకోవాలని, అతను భారత్ తుది జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. తాము అత్యుత్తమ ఆటగాళ్లతోనే పోటీ పడాలనుకుంటున్నామని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
దీనితో పాటు మరికొన్ని అంశాలపైనా స్పందించాడు. గత ఆసియా కప్లో పహల్గాం దాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించడం ఎంత పెద్ద దుమారాన్ని రేపిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఆదివారం మ్యాచ్లో క్రీడా స్ఫూర్తి కనిపిస్తుందని ఆశిస్తున్నానంటూ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా వ్యాఖ్యానించాడు. అయితే మరి పాక్ జట్టు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా అని అడగ్గా అది మ్యాచ్ రోజే తెలుస్తుంది అంటూ దాటవేశాడు.
ఇదిలా ఉంటే పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతని బౌలింగ్ యాక్షన్ విరుధ్మంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అతనికి మద్దతుగా నిలిచాడు. అతని యాక్షన్ ఇప్పటికే రెండుసార్లు క్లియర్ అయ్యిందనీ, మీడియా అనవసరంగా హైప్ చేస్తోందన్నాడు. యాక్షన్ క్లియర్ అయినప్పుడు ఇక చర్చ ఎందుకంటూ సల్మాన్ ప్రశ్నించాడు. ఉస్మాన్ తారిఖ్ తన వింత యాక్షన్తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని భావిస్తున్నారు.ఇక భారత్, పాక్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచే అవకాశముందని తెలుస్తోంది. అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. అయితే బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లకు మాత్రం నష్టాలు తప్పవు.