రఫ్ఫాడించిన అరుంధతి రెడ్డి… తొలి టీ20లో ఆసీస్ పై భారత్ గెలుపు…!

ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘనంగా ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా డీఎల్‌ఎస్ పద్దతిన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 1:15 PM IST

ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘనంగా ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా డీఎల్‌ఎస్ పద్దతిన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. జార్జియో వేర్‌హమ్ 19 బంతుల్లో 4 ఫోర్లతో 30, ఫోబే లిచిఫీల్డ్ 19 బంతుల్లో 5 ఫోర్లతో 26, ఎల్లిస్ పెర్రీ 20 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. అయితే ఈ ముగ్గురిని అరుంధతి రెడ్డినే ఔట్ చేసింది.

ఆమెతో పాటు శ్రీచరణి , రేణుక సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, దీప్తి వర్మ చెరో వికెట్ తీసారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు వర్షం అంతరాయం కలిగించే సమయానికి 5.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 21 దూకుడుగా ఆడే క్రమంలో ఔటైనా.. స్మృతి మంధాన 17 బంతుల్లో 2 ఫోర్లతో 16, జెమీమా రోడ్రిగ్స్ అజేయంగా నిలిచారు. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డీఎల్‌ఎస్ పద్దతిన మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు.

ఈ లెక్క ప్రకారం భారత్ 21 పరుగుల ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 గురువారం కాన్‌బెర్రా వేదికగా జరగనుంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత్ మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్ 2025 విజయానంతరం భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి ద్వైపాక్షిక సిరీస్ ఇదే. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 లక్ష్యంగా భారత మహిళల జట్టు సిద్దమవుతుంది.

Published : 
  • 16 February 2026, 1:15 PM IST