Top Story: మా వల్ల కాదు.. చేతులెత్తేసిన వల్లభనేని, కొడాలి..?

వైసీపీ అనగానే వైయస్ జగన్ తో పాటుగా, ఆ పార్టీలోని కొంతమంది నేతలు కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటారు. అందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ కాస్త ముందే ఉంటారు.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 8:27 AM IST

వైసీపీ అనగానే వైయస్ జగన్ తో పాటుగా, ఆ పార్టీలోని కొంతమంది నేతలు కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటారు. అందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ కాస్త ముందే ఉంటారు. వంశీ కంటే నాని ఇంకా ఫేమస్. వైసీపీ ఆవిర్భావ నుంచి జగన్ తో కలిసి ప్రయాణం చేసిన నాని.. 2019 తర్వాత మంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు పేరు వింటే వంటి కాలు మీద లేచే నాని.. అప్పట్లో చేసిన ప్రసంగాలు ఎప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో కనబడుతూనే ఉంటాయి. ఇక 2019లో పార్టీ మారిన వల్లభనేని వంశీ కూడా, టిడిపిని తిట్టే విషయంలో వంశీతో పోటీపడ్డారు. దీనితో ఇద్దరికీ జగన్ ఆశీర్వాదం పుష్కలంగా లభించింది.

వారి వారి నియోజకవర్గాల్లో బలమైన నాయకులుగా ఉన్న ఈ ఇద్దరు 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిపాలయ్యారు. టిడిపి అధిష్టానం ఇద్దరినీ టార్గెట్ చేయడంతో, 2024లో భారీ ఓటమి తప్పలేదు. ఇక ఆ తర్వాత నుంచి ఇద్దరు సైలెంట్ అయిపోయారు. వల్లభనేని వంశీ జైలు జీవితం కూడా గడిపారు. అనారోగ్య సమస్యలతో జైల్లో ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే కొడాలి నానిని మాత్రం ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. అయినా సరే నాని మాత్రం పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు. విమర్శించే విషయంలో కూడా నాని ఒక అడుగు వెనకే ఉంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని పెద్దగా నాని సందడి లేదనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఇద్దరు నేతలు నియోజకవర్గాలకు కూడా, దాదాపుగా దూరమైపోయిన సంకేతాలే కనపడుతున్నాయి. రాజకీయాలకు ఇద్దరూ రిటైర్మెంట్ ఇచ్చేసినట్లు.. పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఎప్పుడైనా జగన్ పిలిస్తే తాడేపల్లి వెళుతున్న ఈ ఇద్దరు, ఆ తర్వాత మళ్లీ మీడియా ముందు దాదాపుగా లేరనే చెప్పాలి. వీరితో సన్నిహితంగా ఉన్న జోగి రమేష్, పేర్ని నాని వంటి వారు మాత్రం, ఎప్పుడూ మీడియాలో కనపడుతూ వస్తున్నారు. విమర్శలు చేసే విషయంలో ఇద్దరు వెనక్కు తగ్గడం లేదు. నియోజకవర్గాల్లో కూడా కాస్త గట్టిగానే తిరిగే ప్రయత్నం జరుగుతుంది. కానీ నాని, వంశీ మాత్రం నియోజకవర్గాలకు దాదాపుగా గుడ్ బాయ్ చెప్పిన సంకేతాలే కనపడుతున్నాయి.

జైలు నుంచి విడుదలైన తర్వాత తన అభిమానులను కలిసేందుకు, నియోజకవర్గంలో అప్పుడప్పుడు పర్యటించారు వంశీ. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనల్లో భావోద్వేగాలు కూడా కనిపించాయి. ఆయన వల్ల లబ్ధి పొందిన కొంతమంది మహిళలు ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపించారు. విజయవాడ రూరల్ మండలంతో పాటుగా గన్నవరంలో, ఉంగుటూరు మండలాల్లో వంశీ కొద్దిపాటి పర్యటనలు చేశారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయిన సంకేతాలే వస్తున్నాయి. వంశీ నియోజకవర్గంలో యాక్టివ్ అయిన తర్వాత మరో కేసు నమోదయింది. ఆ కేసులో దాదాపుగా అరెస్టు చేస్తారని వార్తలు కూడా వచ్చాయి.

అదే సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లి ఏదో ఒక రూపంలో బెయిల్ తెచ్చుకున్నారు వంశీ. ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో తిరిగితే, కేసు పెడతారనే భయం కూడా ఆయనలో కనపడుతోందని.. గన్నవరం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇక కొడాలి నాని కూడా నియోజకవర్గానికి పూర్తిగా దూరమైపోయారు. ఏదో చిన్న చిన్న పనులు ఉంటే మాత్రమే నియోజకవర్గానికి వెళుతున్నారు. అది కూడా అత్యవసరమైతేనే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎవరైనా తనను కలవాలి అంటే హైదరాబాద్ రావాలని నాని చెప్పినట్లు, గుడివాడలో ప్రచారం జరుగుతుంది. కొంతమంది సన్నిహితులు కూడా నియోజకవర్గాన్ని వీడటంతో అసలు ఏం జరుగుతుందో కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పార్టీలో అత్యంత ఫేమస్ అయిన నాని.. గుడివాడ నియోజకవర్గాన్ని తనకు అడ్డాగా మార్చుకున్నారు. అలాంటిది తన సామ్రాజ్యం నుంచి నాని దూరంగా ఉండటంతో, క్యాడర్ లో కూడా ఒక రకమైన ఆందోళన కనబడుతోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కూడా, వైసిపి సమర్థవంతంగా నిర్వహించలేకపోతోంది. లడ్డు వ్యవహారంలో రాష్ట్రస్థాయిలో టిడిపి వైసిపిని టార్గెట్ చేసినప్పుడు.. మీడియాలో నాని ఉండి ఉంటే వైసీపీకి మరింత మద్దతు ఉండేది. నియోజకవర్గంలో పాటుగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కూడా నాని లేని లోటు కనబడుతోంది. ఇటీవల కాలంలో టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. నానికి పట్టున్న ప్రాంతాలపై దృష్టి పెట్టి.. అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం ఉండటంతో, సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు కూడా కొంత పరిష్కారం అవుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ నియోజకవర్గంలో నాని దూరంగా ఉంటే ఆ లోటు పూడ్చడం జగన్ కు కష్టమే.

నాని పార్టీకి దూరమైతే ఆ ప్రభావం జిల్లా పై పడే అవకాశాలు కూడా ఎక్కువే. బందరు పార్లమెంట్లో నానికి ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన దూరంగా ఉంటే ఆయన అభిమానులు కూడా సైలెంట్ అయిపోయాయే సంకేతాలు ఉండవచ్చు. అటు గన్నవరం పరిస్థితి కూడా దాదాపుగా అంతే. గన్నవరం నియోజకవర్గంలో వంశీకి ప్రత్యామ్నాయం తయారు చేయడం జగన్ కు కష్టమైన పని. ఇటీవల కాలంలో జగన్ హెచ్చరించినా సరే ఇద్దరు పెద్దగా పార్టీకి పనిచేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే నాని పూర్తిగా దూరం కావచ్చని వంశీ మాత్రం దూరం అయ్యే అవకాశాలు కాస్త తక్కువే అనే మాట కూడా వినపడుతోంది. న్యాయపరంగా పార్టీ అన్ని విధాలుగా అండగా నిలబడిన ఇద్దరిలో భయం మాత్రం ఎక్కువగా ఉందనేది అక్కడి మాట.

Published : 
  • 17 February 2026, 8:27 AM IST