ఏపీ లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, అటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక నిందితుల లక్ష్యంగా విచారణ సాగుతోంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తో పాటుగా, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా, పలువురు కీలక వ్యక్తులను అరెస్టు చేసిన అధికారులు.. త్వరలోనే మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉండవచ్చని ప్రచారం కూడా ఉంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసు విషయంలో.. బయటపడే విషయాలు ఏంటి అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
మద్యం కుంభకోణం భారీగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కేంద్ర పెద్దల సహకారంతో విచారణలో వెనకడుగు వేయడం లేదు. ఇక అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంటర్ కావడంతో కీలక వ్యక్తులను సదరు దర్యాప్తు సంస్థ కూడా.. అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు మద్యం అక్రమ రవాణా పైనే ఈడీ అధికారులతో పాటుగా సిఐడి అధికారులు కూడా దృష్టి సారించారు. ఇప్పటివరకు మద్యం డిపోలకు ఇచ్చిన ఆర్డర్లతో పాటుగా, ఆన్లైన్ పేమెంట్ సహా పలు అంశాల్లో విచారణ జరిపిన అధికారులు.. ఇప్పుడు మాత్రం రవాణా సహా పలు అంశాలపై దృష్టి సారించి విచారణ చేస్తున్నారు.
తాజా విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి, ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం 400 కోట్ల రూపాయలు దోపిడీ వ్యవహారంపై, సిఐడి అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా కీలకపాత్ర పోషించినట్లు తేల్చారు. ఆయనతోపాటుగా కుమారుడు సునీల్ అలాగే కోడలు కీర్తి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. చిత్తూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ విజయానంద రెడ్డి పేరు కూడా ఇందులో ప్రస్తావించారు. ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇక్కడ జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేరు కూడా బయటకు వచ్చింది. ఆయన అల్లుడు ఏపీఎస్పీసీఎల్ మాజీ ఎండి బావమరిది నరసింహారెడ్డి పేరు కూడా ఇందులో ఉన్నట్లు తేల్చారు. అలాగే ప్రస్తుతం జైల్లో ఉన్న రాజ్ కేశిరెడ్డి, ఆయన అనుచరులు బూనేటి చాణక్య, ఈశ్వర్ ల పాత్ర కూడా ఉందని అధికారులు గుర్తించారు. దీనితో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురుని ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉండవచ్చు. ఇక విచారణలో మరి కొంతమంది నేతల పేర్లు కూడా బయటకు రావడం ఖాయంగా కనపడుతోంది.
అయితే ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన అడుగు పైనే ఆసక్తికర చర్చ మొదలైంది. నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే ఆయన మాత్రం వాళ్లకు బెయిల్ ఇవ్వద్దంటూ ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో త్వరలోనే ఈడి అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా విచారిస్తారు. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అటు మిథున్ రెడ్డిని ఇప్పటికే ఈడి అధికారులు విచారించారు. ఆయనతోపాటుగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ని కూడా విచారించిన సంగతి తెలిసిందే.