ఉచితాలతో రాష్ట్రాలను అమ్మేస్తారా ? రాష్ట్రాలకు సుప్రీం కోర్టు మొట్టికాయలు…!

ఉచిత పథకాలతో రాష్ట్రాలను అప్పలపాలు చేస్తున్నారంటూ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎందుకు ఉచిత పథకాలు గుర్తుకు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Post Published By: dialnews
Updated : 20 February 2026, 11:33 AM IST

ఉచిత పథకాలతో రాష్ట్రాలను అప్పలపాలు చేస్తున్నారంటూ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎందుకు ఉచిత పథకాలు గుర్తుకు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునః సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. తమిళనాడులో ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ 100 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం తమిళనాడు విద్యుత్ బోర్డ్ ఆర్టికల్-23 లోని నిబంధనలను సవరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయామాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలితో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. రెవెన్యూ లోటు అధి కంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు పెద్దఎత్తున ఉచితాలు ఎలా ప్రకటిస్తున్నాయంటూ బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలు సైతం అదనంగా ఉన్న నిధులను రహదారుల అభివృద్ధికి, ఆస్పత్రులకు, స్కూళ్లకు ఉపయోంచవచ్చునని సూచించింది. అందరికీ ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్ ఇవ్వడానికి బదులుగా... ఉపాధి కోసం మార్గాలు తెరిచేందుకు అన్ని రాష్ట్రాలూ కృషి చేయాలని హితవు పలికింది. "దేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం ?

సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్ చార్జీలు చెల్లించలేని వారికి ఉచితంగా అందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ చార్జీలు భరించగల వారికీ ఉచితంగా ఇస్తామనడం సబబేనా? పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తారా ?" అని తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉచితాలకు పెట్టే ఖర్చును విద్యారంగానికి మళ్లించవచ్చునని, ఆ నిధులతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు కదా అని సూచించింది. "ఉచిత ఆహారం, ఉచిత విద్యుత్. ఇలా అన్నీ ఉచితంగా ఇస్తే ఆపై ఎవరు పని చేస్తారు ? పని సంస్కృతికి చెల్లు చీటి ఇవ్వాలనుకుంటున్నారా ?" అని బెంచ్ నిలదీసింది. ప్రభుత్వ రాయితీలను అర్హులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా పొందడం దేశాభివృద్ధికి హానికరమని బెంచ్ అభిప్రాయపడింది. అప్పుల భారంలో చిక్కుకున్న స్థితిలో ఉచితాలను ఏ విధంగా పంపిణీ చేస్తారనేది చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

తమిళనాడులో ఉన్నట్లుండి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని అడిగింది. దీని వల్ల విద్యుత్ పంపిణీ కంపెనీలు నిధుల కొరతతో బడ్జెట్ లెక్కలకు తగ్గట్లు టారిఫ్‌లను సవరించేందుకు ప్రయత్నించాల్సి వస్తోందని పేర్కొంది. విద్యుత్ టారిఫ్‌ను నోటిఫై చేసిన తర్వాత ఇంత బృహత్తర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు విద్యుత్ బోర్డ్‌ను ప్రశ్నించింది. ఇది బుజ్జగింపు రాజకీయం కాదా అంటూ స్టాలిన్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది.

ప్రజా స్వామ్యంలో ఒక పథకాన్ని ప్రకటించే ముందు, దానికోసం నిధులు ఎలా సమకూర్చుతారనేది బడ్జెట్లో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఉచితాల వ్యయభారం చివరకు పన్నులు చెల్లిస్తున్నవారిపై పడుతుందని, ఈ పరిస్థితి మారాల్సి ఉందని కటువుగా వ్యాఖ్యానించింది. తమిళనాడు ప్రభుత్వం అనే కాకుండా.. అన్ని ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలూ భారీగా ఉచితాలను ప్రకటించే ముందు పునః సమీక్షించుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం వాదనలు వినిపించారు.

Published : 
  • 20 February 2026, 11:33 AM IST