ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. అయితే మైదానంలో ఆట మొదలవ్వకముందే ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తన కామెంట్స్‌తో వాతావరణాన్ని వేడెక్కించాడు. ముంబైలో హోరెత్తే భారత అభిమానుల కేకలను ఆపేస్తామంటూ సామ్ కరన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారాయి.సామ్ కరన్ చేసిన ఈ కామెంట్స్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేస్తున్నాయి. నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లక్ష మందికి పైగా ఉన్న భారత అభిమానులను నిశ్శబ్దంగా మార్చడమే తన లక్ష్యమని చెప్పి.. అన్నంత పని చేసి కప్పును ఎగరేసుకుపోయాడు.
ఇప్పుడు అదే తరహాలో సామ్ కరన్ గురువారం వాంఖడే స్టేడియం నిశ్శబ్దంగా మారుతుందని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు. స్టేడియంలో నిశ్శబ్దం నెలకొందంటే దాని అర్థం ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని సామ్ కరన్ ధీమా వ్యక్తం చేశాడు.వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా పేరుగాంచింది. దీనిపై స్పందిస్తూ.. ఈ సెమీఫైనల్ మ్యాచ్ కూడా హై-స్కోరింగ్ పోరుగా నిలుస్తుందని సామ్ కరన్ అంచనా వేశాడు. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉన్నందున సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. తాము ఎవరికీ భయపడమనీ, ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఉత్సాహంతో ఉందని సామ్ కరన్ భారత్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో తలపడటం ఇది వరుసగా మూడోసారి.
2022లో ఇంగ్లాండ్ గెలవగా.. 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 2026లో 'డిసైడర్' లాంటి ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ స్వదేశీ గడ్డపై చెలరేగాలని పట్టుదలతో ఉంది.భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండగా.. బ్యాటింగ్‌లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ వంటి హిట్టర్లు ఉన్నారు. ఇటు ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్, శామ్ కరన్, జోఫ్రా ఆర్చర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వాంఖడే గడ్డపై అభిమానుల మద్దతు భారత్‌కు అదనపు బలంగా మారనుంది.