ఐపీఎల్ సంచలన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఆడుతున్న తీరు ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2025లో సెంచరీతో పాటు ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి, పూర్తిగా మ్యాచ్‌ని వన్ సైడ్ చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో 38 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 127 పరుగులకే ఆలౌట్ కాగా.. రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
వైభవ్ ఆటకు ఫ్యాన్ అయిపోయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ .. వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ బీసీసీఐకు రిక్వెస్ట్ చేశాడు. అతన్ని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని, టీమిండియా అప్‌కమింగ్ ఇంగ్లండ్ టూర్‌కు పంపించాలని సూచించాడు. బీసీసీఐ తెలివిగా ఆలోచిస్తే.. ఆ పర్యటనకు వైభవ్‌ను టీ20 జట్టులో చేర్చాలన్నాడు, అతనికి తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా.. సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అనుభవం కల్పించాలని అభిప్రాయపడ్డాడు.
15 ఏళ్ల బాలుడికి ఇంగ్లండ్ పర్యటనకు అనుమతిస్తారో లేదో తనకు తెలియదనీ అతనికి ఆ అనుభవాన్ని ఇవ్వడం భారత క్రికెట్‌కు మంచిదని వాన్ సూచించాడు.యశస్వి జైస్వాల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడనీ అయితే వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరుతో అతను ఒక సాధారణ ఆటగాడిలా కనిపించాడన్నాడు. జైస్వాల్ బంతిని అంచనా వేస్తూ ప్రశాంతంగా ఆడటానికి ప్రయత్నిస్తే.. ఈ కుర్రాడు మాత్రం కేవలం బంతిని మైదానం బయటకు పంపడంపైనే ఫోకస్ పెట్టాడని ప్రశంసించాడు. అతని ఫియర్లెస్ గేమ్ అద్భుతమని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఐసీసీ రూల్స్ ప్రకారం 15 ఏళ్లు నిండితే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అర్హులైనట్టే. కానీ వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుతమైన ఆటగాడి విషయంలో బీసీసీఐ తొందరపడకూడదని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.