నేడు టాలీవుడ్లో అడివి శేష్ అంటే ఒక బ్రాండ్. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా కూడా అద్భుతమైన థ్రిల్లర్లను అందిస్తూ టాలీవుడ్ 'మిస్టరీ కింగ్'గా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఏ నటుడికైనా ఆరంభంలో ఎదురుదెబ్బలు తప్పవు. తాజాగా అడివి శేష్ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. అది మరేదో కాదు, క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన క్లాసిక్ హిట్ 'చందమామ'. 2007లో విడుదలైన 'చందమామ' సినిమా తెలుగులో ఒక సంచలనం. కృష్ణవంశీ మార్క్ ఎమోషన్స్, కాజల్ అగర్వాల్ అందం, నవదీప్ అల్లరి వెరసి ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాలో నవదీప్ పోషించిన ఆ చలాకీ కుర్రాడి పాత్రకు మొదట ఎంపికైంది అడివి శేష్ అన్న విషయం చాలా మందికి తెలియదు.
"కృష్ణవంశీ గారి 'చందమామ' సినిమాలో నవదీప్ పాత్రకు మొదట నన్నే ఎంపిక చేశారు. నిజానికి ఆ సినిమా మొదట 'మల్లెపువ్వు' అనే పేరుతో ప్రారంభమైంది." ఏ నటుడికైనా సినిమాలో అవకాశం రావడమే కష్టం, అలాంటిది అవకాశం వచ్చి షూటింగ్ మొదలైన తర్వాత తొలగించడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. అడివి శేష్‌కు సరిగ్గా అదే జరిగింది. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ, షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత తనను సినిమా నుండి తప్పించారని చెప్పారు.దానికి గల కారణాన్ని కూడా ఆయన ఎంతో నిజాయితీగా అంగీకరించారు. "కానీ నా నటనా సంతోషకరంగా లేక కొన్ని రోజుల తర్వాత నన్ను తప్పించారు" అని శేష్ పేర్కొన్నారు. అప్పట్లో నటనలో తనకు తగినంత అనుభవం లేకపోవడం వల్ల కృష్ణవంశీ గారు ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ ఇవ్వలేకపోయానని ఆయన వివరించారు.
సాధారణంగా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు చాలా మంది కుంగిపోతుంటారు. కానీ అడివి శేష్ మాత్రం ఆ వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకున్నారు. తన నటనను మెరుగుపరుచుకోవడమే కాకుండా, సినిమా మేకింగ్‌లోని అన్ని విభాగాలపై పట్టు సాధించారు. 'కర్మ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంజా వంటి సినిమాలో విలన్ పాత్రలు చేస్తూ, మెల్లగా కథానాయకుడిగా నిలదొక్కుకున్నారు. నేడు అడివి శేష్ సినిమా వస్తుందంటే చాలు, అందులో కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. ఒకప్పుడు 'నటన బాగోలేదు' అని సినిమా నుండి తీసేసిన స్థాయి నుండి, నేడు ఒక సినిమాకు స్క్రిప్ట్ రాసి, దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసే స్థాయికి ఆయన ఎదిగారు.
సినిమా రంగం ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ, దాని వెనుక ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఉంటాయి. అడివి శేష్ పంచుకున్న ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణవంశీ 'చందమామ' సినిమాలో శేష్ ఉండి ఉంటే ఎలా ఉండేదో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా, అప్పటి ఆ వైఫల్యమే ఈరోజు శేష్‌ను ఇంతటి గొప్ప నటుడిగా మార్చిందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం డెకాయిట్ సినిమా విడుదల నేపథ్యంలో శేష్ ఈ ఆసక్తికర అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. కాగా, శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ పదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.