Top story: తెలంగాణ బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే… ఒకరి కింద మరొకరు గోతులు…!

కాషాయ పార్టీ అంటేనే...క్రమశిక్షణకు మారుపేరు. ఎంతటి నేతలైనా హైకమాండ్‌ ఆదేశాలను శిరసా వహిస్తారు. పార్టీలోని నేతల మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా...వ్యక్తిగత పడకపోయినా...పార్టీని గౌరవిస్తారు. పార్టీ తర్వాత ఎవరైనా అన్న దానికి నేతలు విలువిస్తారు.

Post Published By: dialnews
Updated : 13 April 2026, 11:55 AM IST

కాషాయ పార్టీ అంటేనే...క్రమశిక్షణకు మారుపేరు. ఎంతటి నేతలైనా హైకమాండ్‌ ఆదేశాలను శిరసా వహిస్తారు. పార్టీలోని నేతల మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా...వ్యక్తిగత పడకపోయినా...పార్టీని గౌరవిస్తారు. పార్టీ తర్వాత ఎవరైనా అన్న దానికి నేతలు విలువిస్తారు. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం...అందుకు విరుద్దగా సాగుతోంది. నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.అంతా మా ఇష్టం...అంటున్నారు తెలంగాణలోని బీజేపీనేతలు. మేం ఎవరి మాట వినం...మా దారి మాదే...ఒకరి వెళ్లే దారిలో మేం వెళ్లేది లేదంటున్నారు. పార్టీ అభివృద్ధికి పాటుపడాల్సిన నేతలు...పరువును బజారున పడేస్తున్నారు. పార్టీలో మంచి పదవులు సాధించడానికి...తమ పార్టీ నేతలపైనే బురద రాజకీయాలు చేస్తున్నారు. 2029లో అధికారంలోకి రావాలని జాతీయ నాయకత్వం కలలు కంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ నేతల్లో జోష్‌ వచ్చింది. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలని హైకమాండ్‌ వ్యూహాలు రచిస్తోంది.

జాతీయ నాయకత్వం పార్టీని మరింత బలంగా తయారు చేయాలని భావిస్తుంటే...రాష్ట్ర నేతలు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఒకరి కింద మరొకరు గోతులు తవ్వుకుంటున్నారు. ఈ కారణంగా పార్టీ బలపడే సంగతి అటుంచితే...కింద స్థాయి కేడర్‌లో నమ్మకం సడలుతోందని విమర్శలు వస్తున్నాయి. కీలక నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం...కేడర్‌ అయోమయానికి గురవుతున్నారు. పార్టీలో ఇప్పటికే అసలు బీజీపే నేతలు...ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు...గ్రూపులుగా విడిపోయారు. అదే సమయంలో సీనియర్లు వర్సెస్‌ జూనియర్లు అన్న విభజన రాజకీయాలు సాగుతున్నాయి. బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయినా విపక్ష పాత్ర పోషించడంలో, అధికార పార్టీ విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఎవరో చెబితే మేము ఎందుకు వినాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉంది. కొందరు ఏళ్ల తరబడి బీజేపీలో ఉన్నాయమని సీనియర్లు చెబుతుంటే...తాము ప్రజల మద్దతుతో చట్టసభలకు ఎన్నికయ్యామని రంకెలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినా...ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు నేతలు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరంటే ఒకరికి పడకపోవడంతో...పరస్పరం ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారట. నేతలు చేస్తున్న కామెంట్లను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని...ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టలేదని...పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడం లేదంటూ కంప్లయింట్లు చేస్తున్నారు.

కొందరు నేతలైతే...ప్రత్యర్థి పార్టీల నాయకులతో అంతర్గత సంబంధాలు, వ్యాపారాలు ఉన్నాయని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ మేలు కోరి ఈ సమాచారం అంతా చెబుతున్నామని...ఇలాంటి నేతల వల్ల పార్టీకి డ్యామేజ్‌ జరుగుతుందని చెబుతున్నారు. అలాంటి నేతలపై చర్యలు తీసుకోకపోతే...పార్టీకి భవిష్యత్‌లో నష్టం తప్పదని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతల దృష్టిలో పడాలని, వారి వద్ద మార్కులు కొట్టేయాలని తాపత్రయపడేందుకు ఒకరి గోతులు మరొకరు తవ్వుతున్నారు. నాయకులపై ఆరోపణలు, వారి దందాలు, సెటిల్మెంట్లు, భూ వివాదాలు, ఆర్థిక అవకతవకలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారట. ఇతర నాయకుల మీద బురద చల్లబటమే లక్ష్యంగా పలువురు నేతలు కుట్రల్లో ఆరితేరిపోయినట్లు సమాచారం.

తెలంగాణలోని కొందరు బీజేపీ నేతలు...ఎవరు చెప్పినా వినడం లేదు. అంతా మా ఇష్టం అంటున్నారు. అసలు వాళ్లు చెబితే...మేం ఎందుకు వినాలని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై కాకుండా సొంత పార్టీ నేతలపైనే పోరాటం చేస్తున్నారని పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. ఇలా అయితే పార్టీ ఎలా బలపడుతుందని...ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీస్తున్నారు. కొందరు పార్టీ సీనియర్ నేతలు...తమ నాయకత్వంలోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్ఠానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌పై పోరాటంలో బీజేపీ దూకుడుగా వ్యవహరించడం లేదు. అటు బీఆర్ఎస్‌ మాత్రం కాంగ్రెస్‌ను ఎండగడుతూనే ఉంది. అధికారపక్షంపై అనేక అంశాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ను ఓవర్ టేక్ చేయాల్సిన ముఖ్య నేతలు.. ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులతో కాలం గడిపేయడంపై కేడర్‌ జీర్ణించుకోవడం లేదు. పార్టీ అధికారంలోకి రావడమేమో కానీ.. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ శాతమైనా నిలుపుకుంటే చాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published : 
  • 13 April 2026, 11:55 AM IST