ఎంత ఎదిగినా సన్ ఆఫ్ చిరంజీవి…!

ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఎక్వైర్ ఇండియా' కవర్ పేజీపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ఎదుగుదల మరియు తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి

Post Published By: dialnews
Updated : 18 April 2026, 11:33 AM IST

ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఎక్వైర్ ఇండియా' కవర్ పేజీపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ఎదుగుదల మరియు తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో అసలైన 'రియల్ హీరో' తన తండ్రి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, తన తండ్రి ప్రభావం తనపై ఎంతగా ఉందో వివరించారు. "చిన్నప్పటి నుండి నాన్నను చూస్తూ పెరగడం వల్ల ఆయన ఆలోచనా విధానం నాపై గాఢమైన ముద్ర వేసింది. సినిమా పరిశ్రమలో లేదా కుటుంబంలో ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే, అందరికంటే ముందుగా స్పందించే వ్యక్తి నాన్న. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లే గుణం ఆయన సొంతం.

నిజమైన వారసత్వం అంటే ఆస్తులు ఇవ్వడం కాదు, కుటుంబం పట్ల బాధ్యత, పని పట్ల క్రమశిక్షణను అలవర్చడం," అని చరణ్ పేర్కొన్నారు. మెగాస్టార్‌గా కోట్లాది మంది అభిమానాన్ని పొందినా, ఇంట్లో మాత్రం చిరంజీవి చాలా సాదాసీదాగా ఉంటారని చరణ్ వెల్లడించారు. బయట ఎంత పెద్ద స్టార్ అయినా, ఇంటికి వస్తే ఆయన కేవలం ఒక సగటు తండ్రి మాత్రమే. ఆ ప్రత్యేకత మరే ఇతర నటుడిలోనూ తాను చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడలేకపోవచ్చని చరణ్ అభిప్రాయపడ్డారు. నాన్న సృష్టించిన వారసత్వాన్ని మేము చాలా సులభంగా అందుకున్నాం. కానీ దాని వెనుక ఆయన పడ్డ శ్రమ వెలకట్టలేనిది," అని చరణ్ అన్నారు. షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా, చిరంజీవి తన కుటుంబానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి చరణ్ ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు.

"సినిమాల కోసం రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయిన రోజులు నాన్న జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ వరుస షూటింగ్ ల మధ్య చిన్న విరామం దొరికినా, ఆ మూడు రోజులను కుటుంబ సభ్యులతో, సోదరులతో గడపడానికే కేటాయించేవారు. అటు పనిని, ఇటు కుటుంబాన్ని ఆయన సమన్వయం చేసుకునే విధానం అద్భుతం. నేను కూడా ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించాలని అనుకుంటున్నాను," అని చరణ్ తెలిపారు. ఈ ప్రపంచం ఎప్పుడూ విమర్శలు చేయడానికి, నెగిటివిటీని వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉంటుందని చిరంజీవి తనకు తరచుగా చెబుతుంటారని చరణ్ పేర్కొన్నారు. మనం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం, మన ఆలోచనా ధోరణి మనల్ని మానసిక బలాన్ని ఇస్తాయి. అవహేళన చేసేవారి గురించి పట్టించుకోకుండా, మన లక్ష్యం వైపు పయనించడమే సరైన మార్గమని ఆయన తన తండ్రి నుండి నేర్చుకున్నట్లు వివరించారు. రామ్ చరణ్ మాటలను బట్టి చూస్తే, ఆయన కేవలం చిరంజీవి నట వారసత్వాన్నే కాకుండా, ఆయనలోని మానవత్వాన్ని, క్రమశిక్షణను కూడా పుణికిపుచ్చుకున్నట్లు అర్థమవుతోంది. మెగాస్టార్ బాటలోనే నడుస్తూ, గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న చరణ్, తన తండ్రి పట్ల చూపిస్తున్న ఈ గౌరవం అభిమానుల మనసు గెలుచుకుంటోంది.

Published : 
  • 18 April 2026, 11:33 AM IST