ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సృష్టించిన రికార్డు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. కేవలం 28 బంతుల్లో 46 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కాని రీతిలో సునీల్ నరైన్‌ను ఉతికేశాడు.సాధారణంగా ఐపీఎల్లో సునీల్ నరైన్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే ప్రపంచ స్థాయి బ్యాటర్లు కూడా వణికిపోతుంటారు. విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో, రోహిత్ శర్మ 22 ఇన్నింగ్స్‌ల్లో సునీల్ నరైన్ బౌలింగ్‌లో కేవలం రెండేసి సిక్సర్లు మాత్రమే కొట్టగలిగారు.
15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన కెరీర్లో సునీల్ నరైన్‌ను ఎదుర్కొన్న మొదటి ఇన్నింగ్స్‌లోనే.. అది కూడా ఎదుర్కొన్న రెండో బంతికే భారీ సిక్సర్ బాదాడు. దిగ్గజాలకు ఏళ్ల సమయం పట్టిన పనిని.. ఈ 15 ఏళ్ల కుర్రాడు సెకన్ల వ్యవధిలో పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.వైభవ్ సూర్యవంశీ తన ముందు ఎంతటి బౌలర్ ఉన్నా సరే.. ఎదుర్కొన్న మొదటి బంతికే బౌండరీ బాదడం అతడి స్టైల్. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్లు వేసిన తొలి బంతినే ఫోర్ లేదా సిక్సర్‌గా మలచి తన భయం లేని తత్వాన్ని చాటుకున్నాడు.
తన ఐపీఎల్ అరంగేట్రంలో కూడా శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బంతినే సిక్సర్ కొట్టి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 41 సగటుతో 246 పరుగులు సాధించాడు. వైభవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 236.53 ఉంది. ప్రస్తుతం టాప్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న వైభవ్ సూర్యవంశీ.. తన పవర్ హిట్టింగ్ తో స్టేడియాలను హోరెత్తిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ కెరీర్ గణాంకాలు చూస్తే ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా ఉండటం అతని దూకుడుకు నిదర్శనం. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఆకట్టుకుంది.