ఎవరేం అనుకుంటే మాకేంటి...మేం చెప్పినట్లు చేయాల్సిందే. చెప్పింది చేయకపోతే శాల్తీలు లేచిపోతాయి. అధికారం మాది...అంతా మా ఇష్టం. చెప్పిన ఫైల్‌పై సంతకం చేయండి...కాదు కూడదు అంటే...ప్లేస్‌లు మారిపోతాయి. తమ వాడే కూర్చిలో కూర్చుంటాడు...ఇది తెలంగాణలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల బాగోతం. వీరి దెబ్బకు అధికారులు...వణికిపోతున్నారు.తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు అంతా మా ఇష్టం అంటున్నారు. దీపం ఉండగానే చక్క బెట్టుకోవాలనే ఫార్మూలాను ఫాలో అయిపోతున్నారు. అధికారులను బెదిరించి...భయపెట్టి...దొరికినంత దోచుకో...దోచుకుంది దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టాం...మేయర్, ఛైర్మన్ల కుర్చీలేం ఫ్రీగా రాలేదు...ఈ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు...ఇప్పుడే సంపాదించుకోవాలి. అవసరం అయితే...వచ్చే ఎన్నికలకు డబ్బు సంపాదించుకుంటాం...ఒక్క ఫైల్ కూడా సంతకం పెట్టొద్దు. ఎలాంటి ఫైల్ అయినా...తమకు తెలియాల్సిందే. సంతకం పెట్టే ముందు...తమను కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ అధికారులను బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దారికి రాని వారిని నయానో భయానో దారిలోకి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందర్ని అయితే బూతులు కూడా తిడుతున్నారట నేతలు.
తెలంగాణలోని 12 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అన్నింటిలో కొత్త పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి. 90 శాతం మున్సిపాల్టీల్లో మేయర్లు, ఛైర్మన్లు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఎన్నికల్లో పెట్టిన ఖర్చులను రాబట్టుకునే పనిపైనే ఫోకస్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో కొత్త లే ఔట్ల పర్మిషన్లు, బడా కంపెనీలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్ల ఫైళ్లకు మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు తెలియకుండా ఫైళ్లపై ఎలా సంతకాలు చేస్తారని మేయర్లు, ఛైర్మన్లు అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. అంతేకాదు...ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన బిల్లులకు అప్రూవ్ చేయవద్దని హెచ్చరిస్తున్నట్లు...అధికారులు సన్నిహితులు వద్ద వాపోతున్నారు.బిల్లులు సైతం తమకు తెలియకుండా చెల్లించకూడదనే ఆదేశాలు ఇవ్వడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ముందు...కమిషనర్లే చక్రం తిప్పారు. ప్రత్యేక పాలనాధికారులుగా ఏఖచత్రాధిపత్యంగా మున్సిపాల్టీలను ఏలారు. అధికారాలు చేతిలో ఉండటంతో...సామంతరాజుల్లా వ్యవహరించారు. ఇప్పుడు మేయర్లు, ఛైర్మన్లు కొలువుదీరడంతో..ఆందోళనలో పడిపోయారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...మున్సిపాల్టీల్లో జరిగే పనులు వేలు పెడుతున్నారు. తమకు వాటాలు ఇవ్వాలని కమిషనర్లను ఒత్తిడి చేస్తున్నారు.ఎన్నికలకు ముందు పోస్టుల కోసం జోరుగా పైరవీలు చేసుకున్న మున్సిపల్ కమిషనర్లు.. ప్రస్తుతం ఇక్కడ పనిచేయడం కంటే సెలవుపై వెళ్లిపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సెలవులపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మరికొందరు అయితే...తామిక్కడం పని చేయలేం బాబోయ్ ట్రాన్స్‌ఫర్ చేయండి అంటూ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నట్లు సమాచారం. పై అధికారులు సర్దిచెప్పినా మున్సిపల్ కమిషనర్లు వినడం లేదట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, ఛైర్మన్లు...ఒత్తిడి తట్టుకోలేమని లేఖలు రాస్తున్నట్లు సమాచారం.