ప్రపంచ రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఉంటాయని మీరు నమ్ముతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. గడ్డాఫీ అనే ఒక వ్యక్తి అమెరికా చెప్పిన ప్రతి మాట విన్నాడు. అణ్వాయుధాలు వద్దంటే ఇచ్చేశాడు, ఫ్యాక్టరీలు తెరవమంటే తెరిచాడు. కానీ 8 ఏళ్ల తర్వాత అదే అమెరికా ఏం చేసింది..? అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేలా ప్లాన్ చేసింది. డ్రైనేజీ పైపులో శవమై తేలాడు. అవును.. లిబియా నియంత ముఅమ్మర్ గడ్డాఫీ కథ ఇది. ఇప్పుడు ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గడం ఈ ఒక్క స్టోరీ అర్థమైతే.. ఇవాళ ఇరాన్ ఎందుకు అమెరికాను గడ్డిపోచలా తీసేస్తుందో మీకు అర్థమవుతుంది.డిసెంబర్ 19, 2003. గడ్డాఫీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గరున్న సెంట్రిఫ్యూజ్‌లు, యురేనియం, కెమికల్ వెపన్స్.. చివరికి బ్లూప్రింట్లతో సహా అమెరికా, బ్రిటన్ చేతుల్లో పెట్టేశాడు. IAEA (International Atomic Energy Agency) వచ్చి ప్రతి అంగుళాన్ని తనిఖీ చేసింది. అమెరికా అప్పుడు ఏమంది..? 'లిబియా ఒక మోడల్ దేశం' అని పొగిడింది. ఇరాన్, నార్త్ కొరియా కూడా గడ్డాఫీని చూసి నేర్చుకోవాలని లెక్చర్లు ఇచ్చింది. గడ్డాఫీని వైట్ హౌస్ కి పిలిచి షేక్ హ్యాండ్‌లు ఇచ్చారు. కానీ అది కేవలం అతన్ని నిరాయుధుడిని చేయడానికి వేసిన ఒక ఉచ్చు అని గడ్డాఫీకి అప్పుడు తెలియదు.
గడ్డాఫీ 2003లో తన అణ్వాయుధాలను అప్పగించినప్పుడు, అతని దగ్గర దాదాపు 1000 టన్నుల యురేనియం కాన్సంట్రేట్ మరియు అత్యాధునిక సెంట్రిఫ్యూజ్‌లు ఉన్నాయి. అతను వాటిని అప్పగించగానే, పాశ్చాత్య దేశాలు అతనికి "సెక్యూరిటీ గ్యారెంటీలు" ఇచ్చాయి. అంటే, "నువ్వు ఆయుధాలు వదిలేస్తే మేము నీ జోలికి రాము" అని మాట ఇచ్చారు. కానీ 2011లో అదే నాటో దళాలు గడ్డాఫీని ఎదురుదాడి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు బాంబులతో దాడి చేశాయి. ఇది ఇరాన్‌కు నేర్పిన పాఠం ఏంటంటే: "అమెరికా ఇచ్చే సెక్యూరిటీ గ్యారెంటీ.. కేవలం నిన్ను నిరాయుధుడిని చేసే ఒక ఎర మాత్రమే.సరిగ్గా 8 ఏళ్లు తిరగకముందే సీన్ మారింది. లిబియాలో చిన్న గొడవ మొదలవ్వగానే, నాటో తన విమానాలతో వచ్చి బాంబుల వర్షం కురిపించింది. గడ్డాఫీ తన సొంత ఊరిలో ఒక డ్రైనేజీ పైపులో దాక్కుంటే.. అతన్ని బయటకు లాగి, హింసించి, చంపేశారు. అప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ ఏమన్నారో తెలుసా? 'We came, We saw, He died'. ఒక దేశాధినేతను దారుణంగా చంపేస్తే.. ప్రపంచ పెద్దన్న సంబరాలు చేసుకున్న తీరు ఇది.
ఈ సీన్ చూసి నార్త్ కొరియా, ఇరాన్ వణికిపోయాయి. నార్త్ కొరియా అప్పట్లోనే ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది.. 'లిబియా తన ఆయుధాలు వదిలేయడమే అది చేసిన అతిపెద్ద తప్పు. అది ఒక ఇన్వేషన్ టాక్టిక్' అని. ఇక ఇరాన్ విషయానికి వస్తే.. ఖమేనీ చాలా క్లియర్ గా ఉన్నారు. అమెరికాతో ఒప్పందం అంటే అది మరణ శాసనమే అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ట్రంప్ అడిగే '972 పౌండ్ల ఎన్‌రిచ్డ్ యురేనియం' ఇరాన్ ఎందుకు ఇవ్వదు..? ఎందుకంటే, ఆ యురేనియం ఇరాన్ చేతిలో ఉంటేనే అమెరికా గడ్డాఫీకి పట్టిన గతి పట్టించకుండా ఆగుతుంది. అణ్వాయుధం అంటే కేవలం బాంబు కాదు.. అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ.బ్రిటిష్ మరియు అమెరికన్ అధికారులు నార్త్ కొరియా దౌత్యవేత్తలతో "గడ్డాఫీ చూడు ఎలా ఆయుధాలు వదిలేసి ధనవంతుడు అయ్యాడో" అని చెప్తే, ఆ దౌత్యవేత్త నవ్వి "గడ్డాఫీకి ఏం జరుగుతుందో వేచి చూడండి" అన్నాడు. ఆ తర్వాత గడ్డాఫీ చనిపోగానే, నార్త్ కొరియా తన అణ్వాయుధ పరీక్షలను మరింత వేగవంతం చేసింది. ఇప్పుడు ఇరాన్ కూడా అదే దారిలో ఉంది. 2026 నాటి అంచనాల ప్రకారం, ఇరాన్ వద్ద ఉన్న 972 పౌండ్ల అంటే దాదాపు 440 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియంతో ఐదు వారాల్లోనే 11 నుంచి 13 అణు బాంబులను తయారు చేయగలదు.
ప్రస్తుతం ట్రంప్ ఇరాన్ దగ్గరున్న యురేనియాన్ని "న్యూక్లియర్ డస్ట్" అని పిలుస్తూ, దానిని అమెరికాకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇరాన్ దీనిని "Non-starter" అంటే అసలు చర్చకే తావులేని విషయం అని తేల్చి చెప్పేసింది. ఎందుకంటే, ఆ 972 పౌండ్ల యురేనియమే ఇరాన్‌కు ఉన్న ఏకైక రక్షణ కవచం అని వారికి తెలుసు. ప్రపంచ చమురులో 20% పైగా సరఫరా అయ్యే హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించడం వెనుక ఉన్న ధైర్యం కూడా ఇదే.తమను గడ్డాఫీలాగా బలహీనుడిని చేయాలనుకుంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తామని ఇరాన్ సంకేతాలిస్తోంది. కర్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ చెప్పినట్లు.. గడ్డాఫీ 100% కోఆపరేట్ చేశాడు, కానీ మేము అతన్ని చంపాం. ఈ ఒక్క మాట చాలు ఇరాన్ మైండ్‌సెట్ అర్థం చేసుకోవడానికి. శక్తి ఉన్నోడిదే రాజ్యం అని అమెరికా నిరూపిస్తే.. ఆ శక్తిని సంపాదించుకోవడమే మా లక్ష్యం అని ఇరాన్ అంటోంది. అందుకే హార్ముజ్ జలసంధిలో ఈరోజు మంటలు పుడుతున్నాయి.గడ్డాఫీ చేతిలో ఆయుధం ఉన్నప్పుడు అమెరికా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది.. అతను ఆయుధం వదిలేయగానే అతని డెడ్ బాడీని చూసి నవ్వింది. ఈరోజు ఇరాన్ చేతిలో ఆయుధం ఉంది కాబట్టే అమెరికా చర్చలకు పిలుస్తోంది. ఆయుధం లేనినాడు చర్చలు ఉండవు.. కేవలం శవాలు మాత్రమే ఉంటాయి. ఇది ఇరాన్ నేర్చుకున్న అసలైన రక్త చరిత్ర.