పశ్చిమ బెంగాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. తొలిసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసలు బీజేపీ గెలుపునకు కారణాలు ఏంటి ? తృణమూల్ కాంగ్రెస్ వైఫల్యాలా ? లేదంటే నాన్ లోకల్ ఓట్లను తొలగించడం...కాషాయ పార్టీకి కలిసి వచ్చిందా ?పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ జెండా పాతింది. మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. చెప్పినట్లే మమతా సర్కార్‌ను సాగనంపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాలు పని చేశాయి. దీంతో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. తొలిసారి బెంగాల్లో కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
సర్ ద్వారా అక్రమ చోరబాటుదారులు, నాన్‌లోకల్స్ ఓట్లు...దాదాపు 70 లక్షలకుపైగా తొలగించడం బీజేపీకి కలిసి వచ్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల ఓట్లు గంపగుత్తంగా బీజేపీకి వెళ్లాయి. దీంతో కాషాయ పార్టీ విజయం సులువైంది. జంగల్ మహల్, నార్త్ బెంగాల్లో బీజేపీ పట్టు నిలుపుకోవడంతో...తృణమూల్ కాంగ్రెస్‌పై విజయం సాధించడానికి కారణమైంది. అంతేకాకుండా నేషనల్ సెక్యూరిటీ, ప్రాంతీయ భద్రత, బంగ్లాదేశ్‌తో సరిహద్దులు అంశాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో బంగ్లాదేశీయులు చొరబడితే...తమకు ఇబ్బందులేనని స్థానికులు నమ్మారు. గంపగుత్తగా బీజేపీవైపు మళ్లారు.ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే బీజేపీ నేతలు...బెంగాల్‌ను టార్గెట్ చేసుకున్నారు. బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేసిన సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని ప్రకటించారు. గంగానది ప్రవాహం ఎలా ఉంటుందో...ఆ దిశగా కాషాయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అప్పుడే ప్రకటించారు.
ఎన్నికలకు నెల రోజుల ముందుగానే హోం మంత్రి అమిత్ షా...బెంగాల్లోనే పాగా వేశారు. తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోయారు అమిత్ షా. తృణమూల్ కాంగ్రెస్‌ను ఎలా కట్టడి చేయాలో...ప్రణాళిక ప్రకారమే బీజేపీ వ్యవహరించింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన నేతలను బీజేపీలోకి ఆహ్వానించారు. స్థానిక నేతలకు భరోసా కల్పించారు. అంతేకాకుండా యాంటి ఇన్కంబెంసీ కమలం పార్టీకి కలిసి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతకు...వామపక్షాలు, కాంగ్రెస్ ఓట్లు కలిసి వచ్చాయి. హిందూ ఓటర్లు, మథువాలను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆర్జీ కర్ ఆసుపత్రి అత్యాచార కేసును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆమె కుటుంబానికి టికెట్ ఇచ్చి...నిలబెట్టింది. ఇది కూడా బీజేపీ గెలుపునకు కలిసి వచ్చింది.