Top story: విజయ్ చేతిలో ‘న్యూక్లియర్ ఆప్షన్’ విజయ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే..? రాజ్యాంగం ఏం చెప్తుంది..? తమిళనాట మళ్ళీ ఎన్నికలు ఖాయమా..?

తమిళనాడు రాజకీయాల్లో 2026 ఎన్నికల ఫలితాల తర్వాత దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో టీవీకే ఎమ్మెల్యేలు

Post Published By: dialnews
Updated : 9 May 2026, 2:30 PM IST

తమిళనాడు రాజకీయాల్లో 2026 ఎన్నికల ఫలితాల తర్వాత దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో టీవీకే ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేస్తే ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా ఉంది. తమిళ గడ్డపై రాజకీయం మునుపెన్నడూ లేని విధంగా మలుపు తిరిగింది.108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంతో టీవీకే ఇప్పుడు 'న్యూక్లియర్ ఆప్షన్' వైపు మొగ్గు చూపుతోంది. తన 108 మంది ఎమ్మెల్యేలతో సామూహిక రాజీనామా చేయిస్తామని విజయ్ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. తమిళనాడు అసెంబ్లీ రద్దవుతుందా..? మళ్ళీ ఎన్నికలు వస్తాయా..? లేక గవర్నర్ రూల్ వస్తుందా..? భారత రాజ్యాంగం ఏం చెబుతోంది..?

మొదటి ట్విస్ట్ ఏంటంటే.. 108 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన వెంటనే ఎన్నికలు రావు. రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే, అసెంబ్లీ మొత్తం బలం 234 నుంచి 126 కి పడిపోతుంది. అప్పుడు మెజారిటీ మార్కు కేవలం 64 మాత్రమే అవుతుంది. అంటే, డీఎంకే లేదా అన్నాడీఎంకే అతి తక్కువ సీట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఇది విజయ్ వ్యూహానికి ఎదురుదెబ్బ అయ్యే అవకాశం కూడా ఉంది. మరోవైపు, దాదాపు సగం అసెంబ్లీ ఖాళీ అయిపోతే 'రాజ్యాంగ సంక్షోభం' ఏర్పడుతుంది.ఏ పార్టీ కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని నడపలేదని గవర్నర్ భావిస్తే, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. అప్పుడు అసెంబ్లీని రద్దు చేసి లేదా సుప్తచేతనావస్థలో ఉంచి, పరిపాలనను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏదైనా సీటు ఖాళీ అయితే 6 నెలల్లోపు అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాలి. 108 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగడమంటే అది 'మినీ అసెంబ్లీ ఎన్నికల'తో సమానం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ విజయ్‌కు పట్టం కడితే.. అది కేవలం గెలుపు మాత్రమే కాదు, వ్యవస్థపై విజయ్ చేసిన తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోతుంది.

కానీ ఇది అంత ఈజీ కాదు. ఎన్నికల కోసం ఒక్కో ఎమ్మెల్యే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఆరు నెలలకే ఎన్నికలు అంటే అందరూ సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాగే, ఉప ఎన్నికల్లో మళ్ళీ అందరూ గెలుస్తారన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే రాజీనామా అనేది విజయ్ దగ్గర ఉన్న 'చివరి అస్త్రం' మాత్రమే. చూశారుగా.. రాజీనామా అనేది ఒక పదునైన కత్తి లాంటిది. అది ప్రత్యర్థులను దెబ్బకొడుతుందా లేక విజయ్ కు నష్టం చేస్తుందా అనేది వేచి చూడాలి.ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు ఇచ్చినంత మాత్రాన అవి వెంటనే ఆమోదం పొందవు. రాజీనామాలు స్వచ్ఛందంగా చేశారా లేక ఒత్తిడితో చేశారా అని స్పీకర్ విచారణ చేయవచ్చు. ఒకవేళ స్పీకర్ రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్‌లో పెడితే, విజయ్ వ్యూహం అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఆరు నెలలకే రాజీనామా చేస్తే.. ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు...? "వ్యవస్థను మార్చడానికి త్యాగం చేశారని" సానుభూతి చూపిస్తారా..? లేక "మా ఓటును వృధా చేసి మళ్ళీ ఎన్నికల ఖర్చు మా మీద వేశారని" ఆగ్రహం వ్యక్తం చేస్తారా..? అనేది కూడా కీలకమే. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ మధ్య గ్యాప్ పెరుగుతున్న తరుణంలో, విజయ్ గనుక రాజీనామా అస్త్రం ఉపయోగిస్తే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నిర్ణయం నేషనల్ పాలిటిక్స్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.

Published : 
  • 9 May 2026, 2:30 PM IST