Top story: సిపి సుమతి రంగంలోకి దిగితే గాని, సిటీలో ఆడవాళ్ళ బాధలు అర్థం కాలేదా?

మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు తీసుకోగానే సి పి సుమతి పెద్ద సాహసమే చేశారు. దిల్షుక్నగర్ బస్ స్టాప్ లోఒక సాధారణ మహిళగా మూడు గంటల పాటు నిలబడినశ్రీమతి సుమతినీ 40 మంది పోకిరీలు వేధించారట.

Post Published By: dialnews
Updated : 11 May 2026, 12:30 PM IST

మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు తీసుకోగానే సి పి సుమతి పెద్ద సాహసమే చేశారు. దిల్షుక్నగర్ బస్ స్టాప్ లోఒక సాధారణ మహిళగా మూడు గంటల పాటు నిలబడినశ్రీమతి సుమతినీ 40 మంది పోకిరీలు వేధించారట. వీళ్ళలో కాలేజీ స్టూడెంట్స్, గంజాయి బ్యాచ్ తోపాటు అల్లరి చిల్లరగా తిరిగే వెధవలు కూడా ఉన్నారు. వాళ్లందరినీ పట్టుకొని స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. ఒక మహిళగా.... పోలీసు ఉన్నతాధికారిణిగా సుమతి చేసిన సాహసాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే. అర్ధరాత్రి పూట అలా ఒంటరిగాఫుట్ పాత్ పై మూడు గంటలపాటు నిలబడి ఉండి, పోకిరీల వేధింపులు భరించడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఒక ఐపీఎస్ ఉన్నతఅధికారిని అయి ఉండి సుమతి ఇలాంటి సాహసం చేయడం పై అన్ని వైపుల నుంచి అభినందనలు వస్తున్నాయి.

దిల్షుక్నగర్ లోనే కాదు హైదరాబాదులో కూకట్పల్లి, కెపిహెచ్ బి, మియాపూర్, మోహిదీపట్నం, సికింద్రాబాద్, ఉప్పల్ బస్ స్టాప్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ చీకటి పడితే ఆడపిల్లలందరికీ ఈ వేధింపులు చాలా కామన్. కాలేజీ ఆడపిల్లలు, ఉద్యోగినులు, సామాన్య మధ్య తరగతి మహిళలు... బస్టాప్ లో, ఫుట్పాతలపై నిలబడి ఉంటే పోకిరి గ్యాంగ్ లు వచ్చి వాళ్లని నానా యాగి చేయడం, వేధించడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సుమతి మేడం కొత్తగా మల్కాజ్గిరి సిపిగా వచ్చి పరిశోధన చేసి కనుక్కున్నట్లు చెప్పడమే చాలా ఆశ్చర్యంగా ఉంది.కనీసం కమిషనర్ సుమతి ద్వారానైనా ప్రభుత్వానికి, ప్రజలకి ఈ విషయం మరోసారి తెలిసింది. ఆపరేషన్ ద్వారా ఐపీఎస్ సమితి ఏం చెప్పాలనుకున్నా రూ? ఎవరిని నిలదీయాలనుకున్నారు? ఎవరికి గడ్డి పెట్టాలనుకున్నారు? జనాన్ని పట్టించుకోని పోలీసు వ్యవస్థక? పోలీసులను పట్టించుకోని ప్రభుత్వానిక?

ఈ ఓవరాల్ ఎపిసోడ్లో జనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే. కమిషనర్ మేడం 10 మంది పోలీసులను
మఫ్టీ లో పెట్టుకుని ఈ సాహసానికి సిద్ధమయ్యారు. ఆ మఫ్టీ పోలీసులే ఈ ఫోటోలు, వీడియోలు తీశారు. తన చుట్టూ దూరంగా నైనా..... తన సబార్డినేట్ పోలీసులు ఓ పది...15 మంది ఉన్నారు కనుక..., తనకేమీ జరగదు అనే ధైర్యంతోనే కమిషనర్ మేడం అక్కడ మూడు గంటల పాటు ధైర్యంగా నిలబడి ఉన్నారు. కానీ కమిషనర్ మేడం కి చుట్టూ మఫ్టీ పోలీసులు ఉన్నట్లు, సామాన్య ఆడవాళ్లకు చుట్టూ రక్షణగా ఎవరు ఉండరు. ప్రతిరోజు వేలమంది ఆడపిల్లలు, ఉద్యోగినులు, మధ్యతరగతి మహిళలు.. ఏ సెక్యూరిటీ లేకుండానే, చుట్టూ రక్షక భటులు వలయంగా కాపలా కాయకుండానే... ఉదయం, సాయంత్రం, రాత్రి అక్కడే నిలబడి బస్సులెక్కుతారు. ఏళ్ల తరబడి... జనరేషన్స్ మారుతున్న... పోకిరిల ఆగడాలను రోజు భరిస్తూనే ఉంటారు. అసలు చీకటి పడితే అవన్నీ కామన్ గానే ఉంటాయిలే అనే భావన లోనే, మన కర్మ ఇంతేలే ఏం చేస్తాం అనే బాధలోనే ఏళ్లు గడిపేస్తున్నారు.

ఏ సామాన్య మధ్యతరగతి ఆడపిల్లకి ఈ సిటీలో చుట్టు పదిమంది పోలీసు లు కాపలా ఉండరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కమిషనర్ సుమతి మేడం మూడు గంటల పాటు అక్కడ వేచి ఉంటే... ఒక్క రక్షక్ వెహికల్ కూడా రాలేదా? ఆమెను పోకిరి గ్యాంగులు వేధిస్తుంటే వాళ్లు చూడలేదా? చూసి చూడనట్టు వదిలేసారా? ఆ ఏరియా పోలీసులు కనీసం అటువైపు రాలేదా? దీనిపై చర్చ జరగాలి. ఇలా ఒక మహిళను మూడు గంటలపాటు పోకిరీలు, గంజాయి బ్యాచ్లు, జులాయి వెధవలు వేధిస్తుంటే అది పోలీసు వైఫల్యం కాదా? మూడు గంటల పాటు రక్షకు వెహికల్ అటువైపు రాలేదు అంటే ఈ వైఫల్యం ఎవరిది ?దిల్షుక్ నగర్ లాంటి ప్రతి పెద్ద బస్టాప్ దగ్గర కచ్చితంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ షిఫ్ట్ వారిగా ఉండాలి. వాళ్లు రక్షక్ వెహికల్ తో అనుసంధానం చేసుకుంటూ ఏం జరిగినా రెండు నిమిషాల్లో పోలీస్ బలగాలు వచ్చేటట్టుగా వ్యవస్థ ఏర్పడాలి. అసలు హైదరాబాదులో ఎన్ని బస్టాపులకు దగ్గరలో రక్షక వెహికల్స్ ఉంటాయి? ప్రతి పది నిమిషాలకు ఒకసారి రక్షక్ వెహికల్ బస్ స్టాప్ చుట్టూ ఒక రౌండ్ వేసి వెళ్ళాలి. అలాంటి దృశ్యాన్ని మనం ఎప్పుడైనా చూసామా? దిల్షుక్నగర్, సికింద్రాబాద్, కెపిహెచ్బి, కూకట్పల్లి ఇలాంటి బిజీ సెంటర్స్ లో లక్షల్లో మహిళలు రోజు బస్సులు ఎక్కి దిగుతూ ఉంటారు.

రాత్రి ఒంటిగంట రెండు వరకు ప్రయాణం చేస్తూనే ఉంటారు. మహిళలు షిఫ్ట్ జాబ్స్ చేస్తూ వచ్చి పోతూ ఉంటారు. వీళ్ళందరి కోసం ప్రతి పెద్ద బస్ స్టాప్ దగ్గర రోజుకి ఓ నలుగురు పోలీసుల్ని పెట్టలేమా? అసలు అక్కడ పోలీసులే ఉంటే రౌడీలు, పోకిరీలు , గంజాయి బ్యాచులు ఎక్కడి నుంచి వస్తారు? మహిళలలను ఎలా వేధిస్తారు? కమిషనర్ సుమతి కనుగొన్న విషయం హైదరాబాద్ కి కొత్త విషయం ఏమీ కాదు. ఇలాంటి మహిళలు రోజు కనీసం 20 లక్షల మంది తెల్లవారి నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల్లోపు బస్సులు ఎక్కి దిగి ప్రయాణిస్తూ ఉంటారు. ఒకరకంగా సిపి సుమతి బయట పెట్టిన విషయానికి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఒక మహిళను మూడు గంటల్లో 40 మంది చుట్టూ ముట్టారంటే ఎలాంటి తోడేళ్ల వ్యవస్థను మన సృష్టిం చామో అర్థమవుతుంది. సిటీలో మహిళలు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో, ఇళ్లకు చేరేవరకు ఎంత భయంతో బతుకుతారో ,సుమతి చేసిన సాహసోపేత కార్యక్రమం వల్ల బయటపడింది.

ఈ సమస్యకు పరిష్కారం సీసీ కెమెరా ఒక్కటే కాదు. డ్రోన్ ఆపరేషన్ అంతకంటే కాదు. వాటితో పాటు ప్రతి బస్ స్టాప్ కి మూడు షిఫ్టులో ఒక ఆర్మడ్ పోలీస్ కచ్చితంగా ఉండాలి. అందుకు తగినట్లుగా పోలీస్ శాఖ సిబ్బందిని పెంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మన పోలీసులందరూ ముఖ్యమంత్రి ,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వీళ్లకు పర్సనల్ సెక్యూరిటీగా వెళ్లడానికి సరిపోతుంది. ఇక సిటీలో జరిగే ముఖ్యమైన పెళ్లిళ్లు, అధికార కార్యక్రమాలు, నేతల వ్యక్తిగత కుటుంబ ఫంక్షన్లో, ధర్నాలు, దొమ్మీలు, ఆందోళనలు వీటికే మన పోలీస్ బలగాలు సరిపోతున్నాయి. ప్రజల రక్షణ కోసం పోలీసులు పనిచేయడం అనేది ఏదో పుస్తకాల్లో చదువుకోవడానికి తప్ప బయట ఎక్కడా కనిపించదు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లయినా సరే ఈరోజుకి మన లా అండ్ ఆర్డర్ లో ఎటువంటి మార్పులు రాలేదు.

సంస్కరణలు జరగలేదు. బస్టాప్ లో, మార్కెట్లలో, మాల్స్ లో ఆడపిల్లల్ని, మహిళల్ని నీచాతి నీచంగా పోకిరి గ్యాంగులు వేధిస్తూనే ఉన్నాయి. అదొక సమస్య అయితే ఇవే జన సమర్థ ప్రాంతాల్లో సెక్స్ వర్కర్ల సమస్య మరొకటి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు... ఈ ప్రాంతాల్లో ఓపెన్ గానే అన్ని జరుగుతున్నాయి. హఠాత్తుగా అవేవో ఇప్పుడే కనుక్కున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద మల్కాజ్గిరి కమిషనర్ సుమతి మేడం స్టింగ్ ఆపరేషన్ వలన.... సిటీలో పోలీసులు మహిళల రక్షణ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. పోలీస్ వ్యవస్థ పనితీరు ఎంత చండాలంగా ఉందో అనే విషయం బయటపడింది. మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో, వ్యవస్థలో లోపాలు ఏమిటో..... కమిషనర్ సుమతి ఒక ఉన్నతాధికారి అయినప్పటికీ ఒక సామాన్య మహిళల కష్టాలని బయట పెట్టారు. అయితే తన ఆపరేషన్ దిల్సుఖ్నగర్ ద్వారా సుమతి ఎవరిని ప్రశ్నిస్తున్నారు,? ఎవరిని నిలదీస్తున్నారో కూడా. స్పష్టంగా చెప్తే బాగుండేది.

Published : 
  • 11 May 2026, 12:30 PM IST