తెలంగాణ రాజకీయాల్లో ‘ఆత్మగౌరవం’ అనే మాట వినిపిస్తే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు.. ఈటెల రాజేందర్. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గొంతుకై నిలిచి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన ఒకే ఒక్కడు.. ఈటెల రాజేందర్. నాడు ఉద్యమ వేదికలపై గర్జించిన ఆ నేత, నేడు దేశ రాజధాని దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌లో కేంద్ర మంత్రి కాబోతున్నారా..? అవును, కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ప్రధాని మోడీ సిద్ధమైన వేళ, తెలంగాణ నుంచి వినిపిస్తున్న అత్యంత కీలకమైన పేరు ఈటెల రాజేందర్.కేసీఆర్ చేతిలో అవమానాలు, పదవి నుంచి బహిష్కరణ, సొంత గూటి నుంచే బయటకు పంపేసిన వేళ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిలబడి, నేడు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు..? ఒక సాధారణ ఉద్యమ నేత నుంచి దిల్లీ కేబినెట్ మంత్రి స్థాయికి చేరిన ఈటెల ప్రస్థానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.
ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం కేవలం పదవుల కోసం మొదలైంది కాదు. 2004లో కమలాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినప్పటి నుండి ఆయన తెలంగాణ వాయిస్‌గా మారారు. నాడు టీఆర్ఎస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులను ఎదిరించి నిలిచారు. కేసీఆర్ తర్వాత పార్టీలో అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల రాజేందర్ మాత్రమే. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులను, కార్మికులను ఏకం చేయడంలో ఆయన పోషించిన పాత్ర అమోఘం.
జైలైనా, లాఠీ చార్జీలైనా ఆత్మగౌరవం కోసం వెనకడుగు వేయని నైజం ఆయనది. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ తొలి కేబినెట్‌లో అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని, కఠినమైన కోవిడ్ సమయంలో క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమించారు. ఆ సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతటి పవర్‌ఫుల్ లీడర్‌గా ఈటెల ఎదిగారు.కానీ, ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువగా కాస్తాయో.. ఆ చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ అంటారు. పార్టీలో ఈటెల రాజేందర్ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోవడం, కేసీఆర్ కుటుంబ పాలనను లోలోపల ప్రశ్నించడం ప్రగతి భవన్‌కు నచ్చలేదు. దాంతో ఒక పక్కా వ్యూహం ప్రకారం ఈటెలపై భూకబ్జా ఆరోపణలు మోపారు. ఎనిమిది మంది రైతుల ఫిర్యాదుల పేరుతో, అర్ధరాత్రి దర్యాప్తులకు ఆదేశించి, కలెక్టర్ నివేదిక ఆధారంగా 2021 మే నెలలో ఈటెలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్.
ఆ రోజు ఒక ఉద్యమ నేతకు జరిగిన అవమానం చూసి తెలంగాణ సమాజం షాక్ అయింది. ప్రెస్ మీట్లలో ఈటెల మాట్లాడిన మాటలు, "నా జెండా గులాబీ జెండా కావచ్చు.. కానీ నా అజెండా తెలంగాణ ఆత్మగౌరవం" అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు క్యాడర్‌లో సెగలు రేపాయి. ఎంతటి వారైనా కేసీఆర్ ని ఎదిరిస్తే అంతే అనుకున్న తరుణంలో.. ఈటెల రాజేందర్ లొంగిపోలేదు. తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, సవాల్ విసిరి బయటకు వచ్చారు.కేసీఆర్ అహంకారానికి, ఈటెల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన కురుక్షేత్రమే హుజూరాబాద్ ఉపఎన్నిక. 2021 జూన్‌లో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల, ఒంటరిగా కేసీఆర్ యంత్రాంగాన్ని డీకొట్టారు. హుజూరాబాద్‌లో ఈటెలను ఓడించడానికి కేసీఆర్ ప్రభుత్వం వందల కోట్లు కుమ్మరించింది, 'దళిత బంధు' లాంటి పథకాలను తెరపైకి తెచ్చింది, మంత్రులందరినీ అక్కడే మోహరించింది. కానీ, హుజూరాబాద్ ప్రజలు ఈటెల వైపు నిలిచారు. దాదాపు 23 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ జెండాను ఎగరేసి, కేసీఆర్ కళ్లల్లో కంటిమీద కునుకు లేకుండా చేశారు ఈటెల.
ఆ విజయంతో తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు వచ్చింది, కేసీఆర్‌ను ఓడించగల ఏకైక మగాడు ఈటెల అనే బ్రాండ్ పడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ఆయన క్రేజ్ తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఈటెలను బీజేపీ అధిష్టానం వదిలేయలేదు. ఆయనలోని మాస్ లీడర్‌షిప్‌ను గుర్తించి, దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి ఎంపీ టికెట్ ఇచ్చింది. అక్కడ ఈటెల సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఏకంగా 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచి, పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. కేబినెట్ ప్రక్షాళన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అందులో తెలంగాణ నుంచి బీసీ కోటాలో, అత్యంత సమర్థుడైన నాయకుడిగా ఈటెల రాజేందర్ పేరు ముందంజలో ఉంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నా, క్యాడర్‌లో మరింత జోష్ నింపాలన్నా ఈటెల లాంటి ఫైర్‌బ్రాండ్ నాయకుడికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని దిల్లీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.నాడు సచివాలయంలోకి రాకుండా కేసీఆర్ అడ్డుకున్న అదే ఉద్యమ నేత.. నేడు దిల్లీ పార్లమెంట్ దాటి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ బెర్త్ దక్కించుకునేందుకు సిద్ధమవడం ఒక అద్భుతమైన పొలిటికల్ రివెంజ్, రియల్ సక్సెస్ స్టోరీ. చూశారుగా.. రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాడు సొంత ఊరిలోనే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసిన శక్తుల ముందే.. నేడు దేశాన్నే శాసించే కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా అడుగుపెట్టబోతున్నారు ఈటెల రాజేందర్. ఒక సాధారణ విద్యార్థి నేత నుంచి, తెలంగాణ ఉద్యమ వీరుడిగా, ఆపై రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, నేడు కాబోయే కేంద్ర మంత్రిగా ఈటెల జర్నీ నిజంగా స్పూర్తిదాయకం.