Top story: ఇరాన్‌-అమెరికా మధ్య శాంతి ఒప్పందం… ఈ ఒక్క విషయంలో మాత్రం సస్పెన్స్‌…!

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా రగులుతున్న ఉద్రిక్తతలకు తెరపడే సమయం ఆసన్నమైందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Post Published By: dialnews
Updated : 15 June 2026, 9:13 AM IST

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా రగులుతున్న ఉద్రిక్తతలకు తెరపడే సమయం ఆసన్నమైందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరు దేశాల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరనుందని, ఆదివారమే దీనిపై సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఒప్పందం ముగింపు దశకు వచ్చిన మాట వాస్తవమే అయినా.. సంతకాలపై ఇరాన్ వైఖరి కాస్త భిన్నంగా ఉంది. అసలు ఈ డీల్ వ్యవహారం ఏంటి ? ఎవరు ఏమంటున్నారు ? ఈ డీల్‌తో నిజంగానే యుద్ధానికి తెర పడుతుందా ?ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఈ ఒప్పందం గురించి సుదీర్ఘంగా స్పందించారు. ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు జరగగానే, మూతపడిన కీలకమైన హోర్ముజ్ జలసంధిని నౌకల రాకపోకల కోసం వెంటనే తెరుస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్‌తో జరిగిన అణు ఒప్పందంపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ డీల్ వల్లే ఇరాన్ అణ్వాయుధాల తయారీకి మార్గం సుగమం అయిందని, దానికోసం వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కానీ, తాను ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయకుండా ఇరాన్‌ను ఒప్పించానని, భవిష్యత్తులో ఇరాన్ పర్వతాల్లో దాచిన యురేనియంను కూడా వెలికితీస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ డీల్ వెనుక పాకిస్థాన్ కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 'ఎక్స్' లో స్పందిస్తూ.. మరో 24 గంటల్లో ఒప్పందం పూర్తి కావచ్చని పోస్ట్ చేశారు. అందులో ట్రంప్, జేడీ వాన్స్, మార్కో రూబియోతో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీలను ఆయన ట్యాగ్ చేశారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారికంగా వెంటనే స్పందించకపోయినా.. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఒక కొలిక్కి వచ్చిన మాట వాస్తవమే కానీ, సంతకాలు చేయడానికి మరింత సమయం పడుతుందన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో ఇకపై 'ఉచిత నౌకాయానం' కుదరదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తేల్చి చెప్పారు. ఆ జలసంధిలో అంతర్జాతీయ జలాలు ఏమీ లేవని, అక్కడ ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు. ఈ టోల్ వసూలు కోసం ఒమన్‌తో ఒప్పందం చేసుకుంటామన్నారు. అమెరికాతో చేసుకోబోయే డీల్‌లో ఈ మేరకు కచ్చితమైన షరతు ఉంటుందని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

ఇదిలా ఉంటే, ఒమన్ తీరంలో భారతీయులున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందని ట్రంప్ చేసిన ఆరోపణలను ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికా సైన్యం చేసిన దాడుల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇటీవలే మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 4న జరగనున్నాయని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. ఈ లోపే శాంతి ఒప్పందాన్ని అధికారికంగా పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద, అమెరికా-ఇరాన్ మధ్య డీల్ తుది దశకు చేరుకున్నప్పటికీ.. హోర్ముజ్ జలసంధిపై టోల్ నిబంధనలకు అమెరికా అంగీకరిస్తుందా ? లాంఛనంగా సంతకాలు ఎప్పుడు జరుగుతాయి? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

 

Published : 
  • 15 June 2026, 9:13 AM IST