భారత జట్టుకు మరో స్పీడ్ స్టార్ దొరికాడు. ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్. పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు.
కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్ట్‌గా మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు. ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భారత్ పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. బ్రార్.. ఫ్లాట్ పిచ్‌పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు.2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత మూడు సీజన్లలోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 2024 నుండి ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసేవరకు కూడా అతనికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్‌లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. గుర్నార్ బ్రార్ పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన వన్డే సిరీస్ అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. మూడు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్‌గా అవకాశం దక్కింది. ఇప్పుడు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్‌కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేసర్ అందిపుచ్చుకున్నాడు.