పాకిస్తాన్ అద్యక్షుడు చేసిన పోస్టే ఇది. భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆసిఫ్ అలీ జర్దారీ రెచ్చిపోయి విమర్శించాడు. సొంత దేశంలో జరిగే అరాచకాల గురించి పట్టించుకోడు కానీ, వారణాసిలో మసీదు వివాదాన్ని మత చిచ్చుగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎక్స్ వేదికగా భారత్‌ను విమర్శిస్తూ 'భారత్‌లోని వారణాసిలో ఉన్న వెయ్యేళ్ల నాటి గంజ్ షహీదా మసీదుతో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు తమను తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయన్నాడు. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలనీ, ఈ చర్యలు కొనసాగితే, అవి భారత విచ్ఛిన్నానికీ, నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉందని విమర్శించాడు. ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నోటి దురుసు వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉంది. ఆ కుట్ర అర్థం కావాలంటే, అసలు వారణాసి మసీదు వివాదం ఏంటో తెలుసుకోవాలి.
వారణాసిలో ఉన్న 'గంజ్ షహీదా మసీదు' కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అందుకు కారణం రైల్వే శాఖ ఇచ్చిన నోటీసులు. ఈ మసీదును రైల్వే శాఖకు చెందిన భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ ఉత్తర రైల్వే యంత్రాంగం నోటీసు జారీ చేసింది. 2026 జూన్ 20 నాటికి మసీదు నిర్మాణాన్ని తొలగించకపోతే తామే స్వయంగా బుల్డోజర్లతో కూల్చివేస్తామని నోటీసులో హెచ్చరించారు. 1991 నాటి ఒక సివిల్ సూట్ 2024 ఆగస్టులో కొట్టివేయబడిందని, దాని ఆధారంగానే ఈ తొలగింపు చర్యలు చేపడుతున్నామని రైల్వే శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. స్టేషన్ విస్తరణ, ప్రతిపాదిత నిర్మాణ పనుల కోసం కాశీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల ఆక్రమణల నుంచి భూములను విడిపించడం అవసరమని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ నోటీసులపై ఎప్పట్లాగే మసీదుని పర్యవేక్షించే అంజుమన్ ఇంతెజామియా మసాజిద్ కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మసీదు దాదాపు వెయ్యేళ్ల నాటిదని, రైల్వే లైన్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు కాకముందే ఇక్కడ మస్జిద్ ఉనికిలో ఉందని కమిటీ వాదించింది.
మరోవైపు.. ఈ వివాదంపై యోగి సర్కార్ కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రైల్వే శాఖ ఇచ్చిన గడువు ముగియడంతో కాశీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు, భద్రతా బలగాలను భారీగా మోహరించారు. లీగల్ నోటీసుల ప్రకారమే ఆక్రమణల తొలగింపు ప్రక్రియ జరుగుతుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని యోగి సర్కార్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఒకవైపు యోగి సర్కార్ ఇక్కడ రూల్ ఆఫ్ లా అమలు చేస్తుంటే.. అది చూసి తట్టుకోలేకనే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ లాంటి వాళ్లు అంతర్జాతీయంగా మొసలి కన్నీరు కారుస్తున్నారు. మన దేశంలో మత చిచ్చు రాజేయాలని చూస్తున్నారు. ఇది తెలుసు కాబట్టే భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో తల దూరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పింది.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విడుదల చేసిన ప్రకటన ఇది. పాకిస్తాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను తిరస్కరిచారు. భారత అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదని కౌంటర్ ఇచ్చారు. పాక్ సొంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయని ఎద్దేవా చేశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వేధించడంలో పాకిస్తాన్‌కు దరిద్రమైన చరిత్ర ప్రపంచం మొత్తానికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు. పాక్‌లో పాక్‌లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా పాక్‌లో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాంటిది మన దేశంలో ముస్లింలను అణచివేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదం కాక మరేంటి?
హిందువులు, ఇతర మైనారిటీలపై దారుణమైన ట్రాక్ రికార్డ్ పెట్టుకుని, ఆసిఫ్ అలీ జర్దారీ లాంటి నేతలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు మానవ హక్కుల గురించి నీతులుచెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. గంజ్ షహీదా మసీదు వ్యవహారం పూర్తిగా భారత చట్టాలు, న్యాయస్థానాల పరిధిలోని అంశం. ఇక్కడ ఆక్రమణల తొలగింపు ఎపిసోడ్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో తలదూర్చి మత చిచ్చు పెట్టాలని చూస్తే.. మోదీ సర్కార్ చూస్తూ ఊరుకోదని విదేశాంగ శాఖ గట్టిగానే హెచ్చరించింది. ఇకనైనా పాకిస్తాన్ తన కన్నింగ్ బుద్ధిని పక్కనబెట్టి, కూలిపోతున్న తన సొంత దేశాన్ని ఎలా కాపాడుకోవాలో చూసుకుంటే మంచిది. లేదంటే అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారీ ఇలాంటి అవమానకరమైన చెప్పుదెబ్బలు తింటూనే ఉండాల్సి వస్తుంది.