ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను డాక్టరేట్ పూర్తి చేసే దశలో ఉండగా, దర్శకుడు మోహన్ గాంధీ తనను బలవంతంగా రచయితగా మార్చారని, 'పోలీస్ బ్రదర్స్' సినిమా విజయం తన కెరీర్‌కు పునాది వేసిందని తెలిపారు. ఒకప్పుడు రోజుకు 18 నుండి 19 గంటలు పనిచేసి, కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాడినని గుర్తుచేసుకున్నారు.
చిన్నప్పుడు 7 రూపాయల కోసం బుట్టలు అల్లిన రోజుల నుండి వందల కోట్ల ఆస్తుల వరకు ఎదిగానని, ఇది కేవలం తన కష్టపడే తత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. ఇండస్ట్రీలో అసిస్టెంట్లకు డబ్బులు ఇవ్వని రోజుల్లో కూడా తాను నెలకు 2000నుంచి 3000 జీతం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. కోరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సంపత్ నంది వంటి సుమారు 30 మంది ప్రముఖులు ఒకప్పుడు తన దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసినవారేనని పోసాని వెల్లడించారు.