దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేసిన ఉధృత పోరాటం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. కానీ, అందరూ అనుకుంటున్నట్లు కేవలం NEET పేపర్ లీకేజీల వల్లే ఆయన వికెట్ పడిందా? లేక చాలా కాలంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాడార్‌లోనే ఉన్నారా? నిజానికి, ఆయన గత కొన్ని ఏళ్లుగా తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలే ఆయన కొంపముంచాయా? విద్యాశాఖ నుంచి పెట్రోలియం శాఖ వరకు ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూ ముసురుకున్న ఆ 5 అతిపెద్ద ఫ్లాష్ పాయింట్స్ ఏంటి? మోదీ ప్రభుత్వం ఆయనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది?
ధర్మేంద్ర ప్రధాన్ కెరీర్‌ను కోలుకోలేని దెబ్బ తీసిన మొదటి మరియు అత్యంత ప్రధానమైన వివాదం.. NEET పేపర్ లీక్ అంశం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగిన NEET-UG మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో వరుసగా పేపర్ లీక్‌లు, గ్రేస్ మార్కుల అక్రమాలు, దారుణమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కోట్లాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో ప్రభుత్వం ఈ సమస్యను లైట్ తీసుకున్నప్పటికీ, 'కాక్‌రోచ్ జనతా పార్టీ' బ్యానర్‌పై వచ్చిన విద్యార్థుల ఉద్యమం, సోనమ్ వాంగ్‌చుక్ నిరసనల తీవ్రతకు కేంద్రం దిగిరాక తప్పలేదు. ప్రధాన్ రాజీనామాకు ఇదే తక్షణ కారణమైంది.
ఇక రెండవ వివాదం.. పాఠ్యపుస్తకాల మార్పు. ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో NCERT పుస్తకాల సిలబస్‌లో భారీ మార్పులు ప్రవేశపెట్టారు. 10వ తరగతి పుస్తకాల నుంచి మొఘల్ సామ్రాజ్యం చరిత్ర, 2002 గుజరాత్ దంగాలు, నర్మదా బచావో ఆందోళన వంటి పాఠాలతో పాటు సైన్స్‌కు సంబంధించిన 'పీరియాడిక్ టేబుల్', 'డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని' కూడా తొలగించారు. దీనిపై దేశంలోని ప్రతిపక్షాలు, చరిత్రకారులు, విద్యావేత్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తన సొంత సిద్ధాంతాల కోసం చరిత్రను తిరగరాస్తోందంటూ విద్యాశాఖపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు, ఇది మోదీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
మూడవది.. పెద్ద పెద్ద యూనివర్సిటీలతో ఆయన పెట్టుకున్న ఘర్షణ వైఖరి. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, పశ్చిమ బెంగాల్‌లోని విశ్వభారతి యూనివర్సిటీలలో వైస్-ఛాన్సలర్ల నియామకాల విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ అనుసరించిన తీరు వివాదాస్పదమైంది. దీనివల్ల నియామకాల్లో తీవ్ర జాప్యం జరిగి ఆయా విద్యాసంస్థల స్వయంప్రతిపత్తి దెబ్బతిన్నదనే ఆరోపణలు వచ్చాయి.
నాలుగవది.. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు మరియు గతం. విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఒడిశాలో 1997 లో పేపర్ లీకేజీలపై అగ్రెసివ్‌గా పోరాడిన ఆయనే.. మంత్రి అయ్యాక మాత్రం విద్యార్థుల ఆందోళనలను తొక్కిపెట్టాలని చూడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. పైగా సమాజంలో వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి కొన్ని పాత చార్జీలు కూడా ఆయన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైనస్‌గా మారాయి.
ఇక ఐదవ మరియు అతి ముఖ్యమైన ఆర్థిక పాయింట్ ఏంటంటే.. పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడు. ధర్మేంద్ర ప్రధాన్ 2014 నుండి 2021 వరకు దేశానికి పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే దేశ చరిత్రలో మొదటిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.100 మార్కును దాటాయి. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కేవలం 60 నుండి 65 డాలర్ల వద్ద చాలా తక్కువగా ఉన్నాయి.
దారుణంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పడిపోయినా, దేశంలో మాత్రం ఇంధన ధరలు పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్య జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ పాపం కూడా ఇప్పుడు ఈయన మెడకు చుట్టుకుంది. వరుసగా చుట్టుముట్టిన ఈ 5 వివాదాల వల్లే ధర్మేంద్ర ప్రధాన్ మోదీ ప్రభుత్వానికి ఒక పెద్ద భారంలా మారిపోయారు. అందుకే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఎలాగో తీసేయాలని అనుకున్న ప్రభుత్వం.. విపక్షాలు, విద్యార్థుల ఒత్తిడికి లొంగిపోయినట్లు కనిపించకూడదనే ఉద్దేశంతో కాస్త టైమ్ తీసుకుని ఆయన చేత రాజీనామా చేయించింది.