మనం రోజూ చూసే సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే, మరికొందరు అదృష్టాన్ని నమ్ముకుంటారు. "ఈరోజు నా శకునం బాగుంది, అందుకే ఈ పని జరిగింది", "నా జాతకం బాగులేదు, అందుకే నాకు లాస్ వచ్చింది" అని ప్రతిదానికీ అదృష్టానికి, శకునాలకి లింక్ పెట్టేవాళ్లు మన మధ్య లేకపోలేదు. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, అదే సమయంలో ఆలోచింపజేసే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'జాతిరత్నం'. ప్రముఖ ఓటీటీ వేదికైన 'ఈటీవీ విన్' తమ వీక్షకుల కోసం 'కథాసుధ' అనే ప్రత్యేక విభాగం ద్వారా సరికొత్త వైవిధ్యమైన సినిమాలను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పేరు విక్రమ్. మనోడికి ఒక పెద్ద బలహీనత ఉంది—అదేంటంటే, ఏ చిన్న పని చేయాలన్నా అదృష్టం, శకునాలు, మూఢనమ్మకాలు, పాత ఆచారాలు అంటూ లెక్కలేసుకుంటూ కాలం గడిపేస్తుంటాడు. 'ఇప్పుడు బయలుదేరితే శకునం బాగుందో లేదో', 'ఈ రోజు ఈ పని చేస్తే అదృష్టం కలిసి వస్తుందో లేదో' అని ప్రతీ నిమిషం ఆలోచించడమే అతడి పని.ఈ అలవాటు పెళ్లి కాకముందు వరకు ఎలాగోలా సాగిపోయింది. కానీ, పెళ్లయిన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో ఏ మార్పూ రాకపోగా, అది ఇంకా ఎక్కువవుతుంది. ఆ మూఢనమ్మకాలు, ఆచారాల పిచ్చి ఏ స్థాయికి చేరుతుందంటే... చివరికి అతడి సొంత కుటుంబానికే ఒక పెద్ద ప్రాణాంతక సమస్య వచ్చిపడుతుంది.
అసలు అదృష్టాన్ని నమ్ముకుని జీవించే ఒక మనిషి వల్ల కుటుంబానికి ప్రాణాపాయం దాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ చిత్రంలో ప్రధానమైన ఉత్కంఠ. ఈ చిత్రానికి వర ముళ్లపూడి దర్శకత్వం వహించారు. ఒక సాధారణమైన పాయింట్‌ను తీసుకొని, దానికి కుటుంబ భావోద్వేగాలు, సందేశం జోడించి తెరకెక్కించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రధాన పాత్రల్లో శశాంక్, రాశి, అన్విష, మణి కేఎల్ కే తమ సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా కథలోని ఉత్కంఠను, విక్రమ్ పాత్రలోని ఆందోళనను శశాంక్ చాలా బాగా పండించారు.ఈ చిత్రాన్ని అనుపమ చంద్ర కోడూరి, శరత్ చంద్రరెడ్డి గుర్రాల సంయుక్తంగా ఎంతో బాధ్యతాయుతంగా నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్లో వచ్చే ఒక డైలాగ్ అందరినీ ఆలోచింపజేసింది."కొన్నిసార్లు విధిని అదృష్టం కాదు.. మనం చేసే పనులే నిర్ణయిస్తాయి.ఈ ఒక్క మాటతోనే సినిమా ఉద్దేశం ఏంటో, ఎంతటి మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారో అర్థమైపోయింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా సినిమా కథనం కూడా అంతే ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం ఆడియన్స్ రొటీన్ మాస్, యాక్షన్ సినిమాల కంటే... కంటెంట్ ఉన్న కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 'ఈటీవీ విన్' తెస్తున్న 'కథాసుధ' సినిమాలు సరిగ్గా ఇలాంటి అభిరుచి ఉన్న వీక్షకులను టార్గెట్ చేస్తూ మంచి ఫలితాలు రాబడుతోంది.