Top story: బ్రాండెడ్ ఫుడ్ ముసుగులో ఘోరం…కేఎఫ్సిలో 1000 కేజీల కుళ్ళిన చికెన్ కేఎఫ్‌సీ, డొమినోస్‌లలో ఫుడ్ తింటున్నారా..?

మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ హోటళ్లకు ఎందుకు వెళ్తాం? నీట్ గా ఉంటుంది.. క్వాలిటీ ఫుడ్ పెడతారు.. హెల్త్ కి సేఫ్ అని నమ్ముతాం కదా. కానీ, ఆ నమ్మకాన్ని నడిరోడ్డుపై కూల్చేసే ఒక భయంకరమైన నిజం తిరుపతిలో వెలుగుచూసింది.

Post Published By: dialnews
Updated : 22 June 2026, 2:21 PM IST

మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ హోటళ్లకు ఎందుకు వెళ్తాం? నీట్ గా ఉంటుంది.. క్వాలిటీ ఫుడ్ పెడతారు.. హెల్త్ కి సేఫ్ అని నమ్ముతాం కదా. కానీ, ఆ నమ్మకాన్ని నడిరోడ్డుపై కూల్చేసే ఒక భయంకరమైన నిజం తిరుపతిలో వెలుగుచూసింది. ప్రముఖ అంతర్జాతీయ చైన్ రెస్టారెంట్ KFC లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కుళ్లిన మాంసం.. చెడిపోయిన చికెన్‌ను కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా చికెన్ ప్రియులను, సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అసలు తిరుపతి KFC లో ఏం దొరికింది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ విభాగం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ సంయుక్తంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని భవానీ నగర్, ఎయిర్ బైపాస్ రోడ్డు పరిసరాల్లో ఉన్న టాప్ బ్రాండెడ్ రెస్టారెంట్లే టార్గెట్‌గా ఈ ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఎవరూ ఊహించని విధంగా అధికారులు నేరుగా KFC, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే వంటి ఇంటర్నేషనల్ ఔట్‌లెట్లలోకి వెళ్లారు. ఎప్పుడూ ఏసీలు, కలర్‌ఫుల్ లైట్లతో తళతళలాడే ఆ రెస్టారెంట్ల లోపలి కిచెన్‌లను, స్టోరేజ్ రూమ్‌లను చూసి స్వయంగా అధికారులే షాక్‌కు గురయ్యారు.

ఈ తనిఖీల్లో ప్రధానంగా రెండు కేఎఫ్‌సీ ఔట్‌లెట్లలో జరిగిన ఘోరాలు బయటపడ్డాయి. బెంగళూరు నుంచి కంటైనర్లలో తెప్పించిన దాదాపు 1,300 కిలోల కంటే ఎక్కువ చికెన్‌ను.. కనీస నియమ నిబంధనలు పాటించకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేశారు. ఫ్రీజర్లలో పెట్టకుండా, కిచెన్ నేలపై పడేసి ఉంచారు. ఆ మాంసం ఇప్పటికే కుళ్లిపోయి, తీవ్రమైన దుర్వాసన వస్తోంది. అంతేకాదు, ఆ చికెన్ ఎప్పుడు తయారైంది? ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది? అనే వివరాలు తెలిపే 'MRD' లేబుల్స్ కూడా వాటిపై లేవు.

అంటే ఎప్పుడో పాడైపోయిన నిల్వ చికెన్‌ను కస్టమర్లకు క్రిస్పీ చికెన్ పేరిట ఫ్రై చేసి పెడుతున్నారన్నమాట. దీంతో అధికారులు ఆ రెండు KFC ఔట్‌లెట్లకు నోటీసులు జారీ చేసి, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. కేవలం KFC మాత్రమే కాదు.. డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే వంటి ఇతర బ్రాండ్లలో కూడా అధికారులు లూప్‌హోల్స్‌ను గమనించారు. వాడే ఆయిల్ నాణ్యత, కూరగాయల నిల్వ పద్ధతులు, కిచెన్లలో పరిశుభ్రతపై అధికారుల టీమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీరందరికీ మున్సిపల్ అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

బ్రాండ్ పేరు చూసి మోసపోవద్దని, కిచెన్ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని ఈ దాడులు నిరూపించాయి. తిరుపతి లాంటి పవిత్ర నగరంలో, ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చే చోట ఇలాంటి కల్తీ, కుళ్లిన ఆహారాన్ని వడ్డించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సమస్య కేవలం తిరుపతికే పరిమితం కాదు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ మీద పెద్ద ఎత్తున ఆందోళనలు రేగుతున్నాయి. ప్రముఖ న్యూడుల్స్ బ్రాండ్లలో కల్తీ కావచ్చు.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆర్డర్ చేసిన బిర్యానీలు, బర్గర్లలో పురుగులు, బల్లులు రావడం కావచ్చు.. సామాన్యుడి ప్రాణాలతో ఈ కార్పొరేట్ సంస్థలు ఆడుకుంటున్నాయి.ఇటీవల కేంద్ర ఆహార భద్రతా సంస్థ కూడా ఈ విషయాలపై సీరియస్ అయ్యింది. మనం హెల్తీ ఫుడ్ అని నమ్మి పిల్లలకు తినిపించే బ్రాండెడ్ ఐటమ్స్‌లోనే విషం దాగుందనే చేదు నిజం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Published : 
  • 22 June 2026, 2:21 PM IST