ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తోంది. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా ఈ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ఏపీ శాసన మండలిలో ఈ వ్యవహారం ఓ రకంగా ఉప్పెనలా మారిందనే చెప్పవచ్చు. తమను రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కల్తీ నెయ్యి వ్యవహారంలో టార్గెట్ చేయడంతో.. వైసీపీ కూడా శాసన మండలిలో అదే స్థాయిలో కౌంటర్ లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ.. సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడిచే హెరిటేజ్ ను టార్గెట్ చేస్తోంది.
ఏపీ శాసన మండలిలో హెరిటేజ్ కంపెనీ నెయ్యి, పాలు, పెరుగు కల్తీ అంశంపై వైఎస్సార్సీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి డిమాండ్ చేయడమే కాకుండా టీటీడీ లడ్డూ కల్తీతో లింక్ చేసి చంద్రబాబు కుటుంబ వ్యాపారాన్ని టార్గెట్ చేసారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కే.ఆర్.జె. భరత్, సిపాయి సుబ్రమణ్యం.. 'రూల్ 58' కింద వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. కానీ వాటిని చైర్మన్ కొయ్యే మోషెన్ రాజు తిరస్కరించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి నుంచి, వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో నాలుగుసార్లు సభ వాయిదా పడింది. తిరుమల పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి షెడ్యూల్ లో ఉన్న అంశాలను పక్కనపెట్టి దీనిపై చర్చించాలని కోరుతూ చైర్మన్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
వైసీపీ ఎమ్మెల్సీలు.. భరత్, సుబ్రమణ్యం, బొత్స సత్యనారాయణ పదే పదే ఇదే అంశాన్ని సభలో లేవనెత్తారు. హెరిటేజ్-ఇందాపూర్ డెయిరీ బంధం, నెయ్యి ధర రూ.300 నుంచి రూ.658కి పెరగడం సహా, టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా గురించి చర్చ జరగాల్సిందే అంటూ డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2014-19), మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ ఫుడ్స్ తిరుమలకు నెయ్యి సరఫరా చేసిందని సభలో ఆరోపణలకు దిగారు. నాణ్యత లోపాల కారణంగా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినప్పటికీ, హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఆ ఒప్పందాలు కొనసాగించారని మండిపడ్డారు. దీనిపై తక్షణమే చర్చ జరపాలంటూ బొత్సా డిమాండ్ చేసారు.
దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖా మంత్రి అచ్చేన్నాయుడు వైసీపీ నిరసనలు డ్రామా అంటూ మండిపడ్డారు. హెరిటేజ్ గొప్ప సంస్థ, టీటీడీ లేదా లడ్డూతో లింక్ లేదని కౌంటర్ లు ఇచ్చారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ చేసారు. వైఎస్సార్సీపీ హయాంలోనే కల్తీ జరిగిందని, ఆ విషయం సిట్.. విచారణలో తేలిందని, రాజకీయ లబ్ధి కోసమే హెరిటేజ్ పేరును లాగుతున్నారని మండిపడ్డారు. మరో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ.. హెరిటేజ్ అంశం ద్వారా వైసీపీ రాజకీయ లబ్ది పొందాలని భావిస్తోందని, దీని వలన ప్రజలకు కలిగిన నష్టం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేసారు. అనంతరం మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్.. హెరిటేజ్‌కు టీటీడీతో లింక్ ఆధారాలు చూపాలి అంటూ సవాల్ చేసారు. తిరుమల లడ్డూ వివాదం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే విపక్షం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మంత్రులు ఎదురు దాడికి దిగారు.
వైసీపీ వాదనల ప్రకారం.. హెరిటేజ్ ఫుడ్స్ వెబ్ సైట్ లో ఇందాపూర్ డెయిరీ భాగమని స్పష్టంగా ఉందని, 2015లో టీటీడీ ఇందాపూర్ నుంచి 5.77 లక్షల కేజీల నెయ్యి కొనుగోలు చేసిందని రికార్డులు చూపిస్తున్నాయని ఆరోపణలు చేస్తోంది. తక్కువ ధరలకు అంటే కేజీ రూ.278-306కు కాంట్రాక్టులు ఇచ్చి, 2018లో కూడా 6.17 లక్షల కేజీలు సరఫరా చేయించారని, ఇది కల్తీ నెయ్యి కుట్ర అని మండిపడింది.దీనిపై స్పందించిన హెరిటేజ్ ఫుడ్స్.. ఇందాపూర్ డెయిరీ తమకు చెందినది కాదని, మహారాష్ట్రలోని స్వతంత్ర ప్రైవేట్ డెయిరీ మాత్రమేనని స్పష్టం చేసింది. డెయిరీల మధ్య సాధారణ వ్యాపారం మాత్రమే జరుగుతుందని, చీజ్, పాలు, పన్నీర్ వంటి ప్రొడక్టులకు కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఉందని, టీటీడీ నెయ్యి సరఫరాతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇందాపూర్ టెండర్లలో పాల్గొనకపోవడం గమనార్హం. నేడు కూడా హెరిటేజ్ వ్యవహారం సభను కుదిపేసింది. హెరిటేజ్ వ్యవహారంతో సభ దాదాపుగా వాయిదా పడుతూనే వస్తోంది. బడ్జెట్ పై కూడా ఇప్పటి వరకు సభలో చర్చ జరగకపోవడం గమనార్హం.