Top story: ధర తగ్గినా పెరగని బంగారం సేల్స్.. అసలు కారణం ఇదే..!

భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన మక్కువ. పండగొచ్చినా, పెళ్లిళ్ల సీజన్ వచ్చినా బంగారం కొనేందుకు ఆభరణాల షాపుల ముందు జనం క్యూ కడుతుంటారు. సాధారణంగా బంగారం ధరలు తగ్గితే కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని భావిస్తారు.

Post Published By: dialnews
Updated : 4 August 2026, 11:00 AM IST

భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన మక్కువ. పండగొచ్చినా, పెళ్లిళ్ల సీజన్ వచ్చినా బంగారం కొనేందుకు ఆభరణాల షాపుల ముందు జనం క్యూ కడుతుంటారు. సాధారణంగా బంగారం ధరలు తగ్గితే కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని భావిస్తారు. కానీ, ప్రస్తుతం దేశంలో ఇందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 37,000 మేర తగ్గినప్పటికీ, ప్రజలు పసిడి కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక కూడా భారత్‌లో బంగారం డిమాండ్ పడిపోయిందని ధ్రువీకరిస్తోంది. డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ గతేడాదితో పోలిస్తే 6 శాతం తగ్గి 131.4 టన్నులకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 139.7 టన్నులుగా నమోదైంది.

ముఖ్యంగా ఆభరణాల డిమాండ్ 15 శాతానికి పైగా తగ్గి, 88.8 టన్నుల నుంచి 75.1 టన్నులకు పరిమితమైంది. జనవరి 29న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అత్యంత గరిష్టంగా 1.79 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరల్లో మార్పుల కారణంగా పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్షా 42 వేల వద్దకు చేరింది. అంటే రికార్డు గరిష్టం నుంచి దాదాపు 37,000 మేర తగ్గింది. సాధారణంగా ధర పడిపోతే డిమాండ్ పెరగాలి, కానీ భారత మార్కెట్లో అందుకు భిన్నంగా జరుగుతోంది. బంగారం కొనకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్తున్నారు విశ్లేషకులు. దేశీయ విదేశీ మారక నిల్వలు వృధా కాకుండా ఉండేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును సీరియస్‌గా తీసుకున్న వినియోగదారులు కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు.

అంతే కాకుండా ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడంతో దిగుమతి వ్యయం పెరిగింది. దీనివల్ల బంగారం దిగుమతులు 23% మేర తగ్గి 98.1 టన్నులకు పడిపోయాయి. గరిష్ట ధరలతో పోలిస్తే 37,000 తగ్గినప్పటికీ, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రేట్లు ఇంకా 60% పైనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ధరలు మరింత తగ్గుతాయేమోననే నిరీక్షణలో జనం ఉన్నారు. పసిడి ఆభరణాలు కొనాలనుకున్నవారు కూడా లైట్‌వెయిట్ జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ - జూన్ మధ్య పెద్దగా వివాహాల సీజన్ లేకపోవడం కూడా డిమాండ్ పడిపోవడానికి ఒక కారణం. దీనికితోడు బంగారంపై తక్షణ రాబడులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు కూడా ప్రస్తుతం బంగారం వైపు మొగ్గు చూపడం లేదు. మొత్తానికి పసిడి ధర గణనీయంగా తగ్గినప్పటికీ, పెరిగిన దిగుమతి పన్నులు, విదేశీ మారక భారంపై ప్రభుత్వ అవగాహన విజ్ఞప్తులు మరియు ధరలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్లే వినియోగదారులు బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.

Published : 
  • 4 August 2026, 11:00 AM IST