దేశంలో బంగారం ప్రియులకు ధరల మంట చుక్కలు చూపిస్తోంది. పండుగలు, శుభకార్యాల సీజన్ వస్తున్నా బంగారం కొనలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు విపరీతంగా పెరిగిన బంగారం ధరలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా దేశంలో పసిడి దిగుమతులు భారీగా పడిపోయాయి. ఇదే సమయంలో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయంగా వెండి వైపు మొగ్గు చూపుతుండటంతో వెండి నగలు, వస్తువులకు మార్కెట్లో తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన లిఖితపూర్వక సమాచారం ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26 నాటికి దేశంలో బంగారం దిగుమతులు 17.23 శాతం మేర క్షీణించాయి.
2021-22లో 868.4 టన్నులుగా ఉన్న దిగుమతులు, 2025-26 నాటికి 718.74 టన్నులకు పడిపోయాయి. పరిమాణం తగ్గినప్పటికీ, అంతర్జాతీయంగా ధరలు పెరగడం మరియు రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతుల బిల్లు మొత్తం పెరిగింది. 2021-22లో 4.36 లక్షల కోట్లుగా ఉన్న బిల్లు, 2025-26 నాటికి 6.88 లక్షల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 120 టన్నులకు మాత్రమే పరిమితమయ్యాయి. దిగుమతులు తగ్గడానికి అంతర్జాతీయ ధరల పెరుగుదల, డిమాండ్ తగ్గుదలతో పాటు కేంద్ర ప్రభుత్వం మే నెల నుంచి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
అంతే కాకుండా పసిడి కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో ఆభరణాల అమ్మకాలు 24 శాతం వరకు తగ్గినట్లు వ్యాపారులు వెల్లడించారు. బంగారం కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న కుటుంబాలు కొద్దిపాటి వెండి వస్తువులు, ఆభరణాల కొనుగోలుతో సరిపెట్టుకుంటున్నాయి. దీంతో వెండి మార్కెట్ ఊపందుకుంది. కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు భారతీయ ప్రమాణాల సంస్థ వెండి నగలు, వస్తువులకు హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను తప్పనిసరి చేసింది. HUID అమల్లోకి రావడంతో వెండిలో అసలైన స్వచ్ఛత ఎంత ఉందో తెలుసుకునే అవకాశం లభించి, కొనుగోలుదారులలో నమ్మకం పెరిగింది.
ఫలితంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 32 లక్షల హాల్‌మార్క్ వెండి వస్తువులు అమ్ముడవగా, 2025-26 లో ఈ సంఖ్య ఏకంగా 59 లక్షలకు చేరి అమ్మకాలు రెట్టింపయ్యాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా బిఐఎస్ తన ల్యాబ్‌ల సామర్థ్యాన్ని రాబోయే రెండేళ్లలో మరింత విస్తరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పసిడి మండిపోతుండటంతో పాటు కిలో వెండి ధర 2.4 లక్షల నుంచి 2.5 లక్షల మధ్య ట్రేడ్ అవుతోంది. రాబోయే పండుగల సీజన్లో స్వల్పకాలికంగా బంగారం 1.57 లక్షలకు, కిలో వెండి ధర 2.8 లక్షల మార్కుకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్-రూపాయి మార్పిడి రేట్లు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ గణాంకాలు రాబోయే రోజుల్లో పసిడి, వెండి ధరల సరళిని నిర్ణయించనున్నాయి.