2027లో 10 వేల కోట్లు.. గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ తప్పదా.. టాలీవుడ్ లో ప్రస్టేజియస్ ఇయర్..!

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక ఏడాదిలో ఒకటి లేదా రెండు భారీ సినిమాలు రావడం కామన్. కానీ టాలీవుడ్ స్క్రిప్ట్ మారుతోంది.

Post Published By: dialnews
Updated : 2 February 2026, 6:30 PM IST

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక ఏడాదిలో ఒకటి లేదా రెండు భారీ సినిమాలు రావడం కామన్. కానీ టాలీవుడ్ స్క్రిప్ట్ మారుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న బజ్, అనౌన్స్‌మెంట్లను గమనిస్తే... 2027 సంవత్సరం తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించే గేమ్ ఛేంజర్ ఇయర్‌గా మారబోతోంది. కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు.. పాన్ వరల్డ్ స్థాయిలో టాలీవుడ్ సత్తా చాటడానికి రంగం సిద్ధమవుతోంది. దశాబ్దాల తరబడి చెక్కుచెదరని రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న ప్రాజెక్టులన్నీ ఒకే కాలెండర్ ఇయర్‌లో క్యూ కడితే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి? అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి సోషల్ మీడియా వరకు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ లిస్టులో అందరి కళ్లూ ముందుగా పడేది మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మీదనే. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేట తర్వాత జక్కన్న చెక్కుతున్న వారణాసి సినిమా హాలీవుడ్ రేంజ్‌లో.. ఇండియానా జోన్స్ తరహా గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే ఈ సాహసయాత్ర కోసం మహేష్ సరికొత్త లుక్‌లో సిద్ధమవుతుండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఈ విజువల్ వండర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్‌లో మరో మెట్టు ఎక్కించే ఒక దృశ్యకావ్యం అవుతుందనడంలో సందేహం లేదు. ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది వారణాసి.

మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. యానిమల్ తో బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ మాస్ చూపించిన వంగా.. ప్రభాస్‌ను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎలా చూపిస్తారో తలుచుకుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. మార్చి 5, 2027న విడుదల కానుంది ఈ సినిమా. ఇక మాస్ మాన్స్టర్స్ జాబితాలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా 2027 రేసులోనే ఉండటం విశేషం. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నీల్.. ఎన్టీఆర్ ఎనర్జీని ఎలా వాడుకుంటారో.. ఆ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నాయి.

ఇక స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్.. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ అట్లీతో చేతులు కలపడం మరో సంచలనం. పుష్పతో నార్త్ ఇండియాను ఏలిన బన్నీ.. షారుక్ కు జవాన్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అట్లీతో సినిమా చేస్తే ఆ మాస్ మ్యాడ్‌నెస్ పీక్స్‌లో ఉంటుంది. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేసే ఎలిమెంట్స్ వీరిద్దరి దగ్గరా పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కనుక 2027లో థియేటర్లలో దిగితే, కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. చివరగా అన్నీ అనుకున్నట్లు జరిగి ఈ సినిమాలన్నీ 2027లో విడుదలైతే, అది టాలీవుడ్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇయర్ గా మిగిలిపోతుంది. ఒకప్పుడు రీజినల్ సినిమాగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ.. నేడు ప్రపంచ సినిమాతో పోటీ పడుతోందనడానికి 2027 ఒక ఉదాహరణగా నిలవనుంది. వందల కోట్ల బడ్జెట్, వేల కోట్ల కలెక్షన్స్, గ్లోబల్ రికగ్నిషన్... వెరసి 2027లో వినిపించేది ఒకే మాట, కనిపించేది ఒకే బావుటా – అదే టాలీవుడ్.

Published : 
  • 2 February 2026, 6:30 PM IST