తమిళ వర్సటైల్ స్టార్ సూర్య, మన తెలుగు మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబో అనౌన్స్ అయినప్పుడే అందరిలో కొండంత ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టే థియేటర్లలోకి వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది!సినిమా అంటే కేవలం భారీ ఫైట్లు, ఊరమాస్ సీన్లు మాత్రమే కాదు.. మనసుకి హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటే థియేటర్లు కలకలలాడతాయని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
సూర్య కథానాయకుడిగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి, ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో సాలిడ్ టాక్‌తో దూసుకెళ్తూ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. సూర్య కెరీర్‌లో ఇది మరొక బిగ్గెస్ట్ మైలురాయి. మన దగ్గరే కాదు, నార్త్ అమెరికా మార్కెట్‌లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఇందులో విశేషమేమిటంటే.. యూఎస్ కలెక్షన్లలో తమిళ వెర్షన్ కంటే మన తెలుగు వెర్షన్ షేరే చాలా ఎక్కువగా ఉంది! వెంకీ అట్లూరి టేకింగ్, సూర్య ఎమోషనల్ యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరినీ థియేటర్లకు రప్పిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.