దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. నేషనల్ అవార్డ్ విన్నర్‌గా తన నటనతో మెప్పించిన ఆమె, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా గడుపుతున్నారు. అయితే, కెరీర్ తొలినాళ్లలో ఆమె చేసిన ఒక నిర్ణయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నితిన్ హీరోగా వచ్చిన 'ద్రోణ' సినిమాలో ప్రియమణి బికినీ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ బికినీ వివాదంపై ఆమె నోరు విప్పారు. ప్రియమణి మాట్లాడుతూ.. 'ద్రోణ' సినిమా కథ విన్నప్పుడు దర్శకుడు బికినీ సీన్ గురించి ఎక్కడా చెప్పలేదని వెల్లడించారు. షూటింగ్ సగం పూర్తయ్యాక, అకస్మాత్తుగా ఆ సీన్ గురించి ప్రస్తావించారట. మొదట ఆ విషయం వినగానే తాను షాక్ అయ్యానని, ఎందుకంటే అంతకుముందు వరకు తను కేవలం పద్ధతిగా ఉండే పాత్రలే చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
"బికినీ సీన్ గురించి వినగానే మొదట భయపడ్డాను. కానీ దర్శకుడు అది కథకు చాలా అవసరమని నన్ను ఒప్పించారు అని ప్రియమణి చెప్పుకొచ్చింది. దర్శకుడు తనను ఒప్పించే క్రమంలో బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ గురించి ఉదాహరణగా చెప్పారట. ఆ సమయంలో కరీనా 'టషన్' సినిమా కోసం 'జీరో సైజ్' లుక్‌లోకి మారి బికినీ ధరించి దేశవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించారు. టాలీవుడ్లో కూడా ప్రియమణిని అలా ఒక కొత్తగా, డిఫరెంట్‌గా చూపించాలన్నది దర్శకుడి ఆలోచన. ఆ మాటలతో ప్రభావితమై, కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని ప్రియమణి ఆ సీన్‌కు ఓకే చెప్పారు. బికినీలో కనిపించడం వల్ల ప్రియమణికి ప్రశంసల కంటే ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. అంతవరకు హోమ్లీ లుక్‌లో చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అలా చూసేసరికి షాక్ అయ్యారు. కేవలం డబ్బు కోసమే ప్రియమణి బికినీ వేసిందనే వార్తలు అప్పట్లో జోరుగా సాగాయి.
ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. అందులో ఎలాంటి నిజం లేదని, కేవలం సినిమాపై ఉన్న ప్యాషన్‌తోనే చేశానని ఆమె స్పష్టం చేశారు.
దుస్తుల విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు ప్రియమణి. "బికినీ వేయడం తప్పు కాదు. కథకు, ఆ సందర్భానికి అనుగుణంగా దుస్తులు ఉండాలి. స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నప్పుడు చీర కట్టుకుని వెళ్లలేం కదా?" అని లాజిక్‌గా ప్రశ్నించారు. అయితే, ఆ సమయంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు తన ఆలోచన మారిందని చెప్పారు. ఒక నటిగా తన కంఫర్ట్ కూడా చాలా ముఖ్యమని, అందుకే ఇప్పుడు అలాంటి గ్లామర్ సీన్లకు తాను దూరమని స్పష్టం చేశారు. ప్రియమణి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ సరసన నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కొన్ని కోర్టు కేసులు, వివాదాల వల్ల ప్రస్తుతం వాయిదా పడింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. అప్పట్లో తను చేసిన ఆ సాహసం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలినా, అది ఒక నటిగా తనను మరింత పరిణతి చెందేలా చేసిందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.