పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా ఉంది. సలార్, కల్కి 2898 AD వంటి భారీ విజయాల తర్వాత.. ప్రభాస్ చేతిలో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫలితం.. దానిపై వచ్చిన టాక్ ఆధారంగా ప్రభాస్ తదుపరి నిర్ణయాలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మారుతితో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇటీవల ప్రభాస్‌తో మూడు భారీ చిత్రాలను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన వెంటనే.. అందులో ఒక సినిమాకి మారుతి దర్శకత్వం వహించనున్నారని, అది కూడా ఒక హారర్-కామెడీ జానర్లో ఉండబోతోందనే ప్రచారం జోరుగా సాగింది.
ది రాజాసాబ్ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. ప్రభాస్ మారుతికి మరో ఛాన్స్ ఇచ్చారంటూ కొన్ని వెబ్ సైట్లు కథనాలను ప్రచురించాయి. అయితే ఈ వార్త ప్రభాస్ అభిమానులను కాస్త అయోమయానికి గురిచేసింది. రాజాసాబ్ సినిమా ఫలితంపై భిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో.. వీరిద్దరి కాంబినేషన్లో వెంటనే మరో సినిమా అంటే ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేక కేవలం పుకార్లేనా? అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మారుతి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ సినిమాను ప్లాన్ చేస్తోందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.తాజాగా ఈ రూమర్స్‌పై ప్రభాస్ టీమ్, సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు.
హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ చేయబోయే మూడు సినిమాలకు వేరే దర్శకులు పని చేయనున్నారని.. మారుతితో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్ట్ చర్చల దశలో లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా కేవలం నిరాధారమైన పుకార్లేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రాలపైనే ఉంది. ఇవి కాకుండా సలార్-2. కల్కి 2 కూడా లైన్లో ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ అభిమానులు అనవసరమైన రూమర్లను నమ్మవద్దని.. అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడాలని టీమ్ సూచించింది. దీంతో మారుతి-ప్రభాస్ రెండో సినిమా వార్తలకు పుల్ స్టాప్ పడినట్లయింది.