టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు అప్పుడప్పుడు పెద్ద మ్యాజిక్ చేస్తుంటాయి. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అలా గతంలో ‘కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో, సతీష్ జివ్వాజీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. కోన వెంకట్ వంటి పెద్ద పేరు ఈ ప్రాజెక్ట్‌తో జతకట్టడంతో సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా, వినోదాత్మక అంశాలతో కూడిన చిత్రంగా ‘బ్యాండ్ మేళం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది.మార్చి నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఇంటి వద్దే కూర్చుని వీక్షించే వీలు కల్పిస్తోంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే కంటెంట్ కోసం వెతుకుతున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 24 నుంచి ‘బ్యాండ్ మేళం’ జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జీ 5 సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మీరు మెచ్చిన జంట మరోసారి దరువేబోతోంది.. మీరు సిద్ధమా?"అంటూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేశారు. ‘కోర్ట్’ సినిమా తర్వాత ఈ జోడీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి వ్యూయర్ షిప్ సాధిస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.