రవితేజ కెరీర్‌కు డేంజర్ బెల్స్.. మాస్ రాజాపై ఆడియన్స్‌కు నమ్మకం లేదా.. ఇంకేం చేయాలి..?
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉండేది
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉండేది. కానీ ఇటీవల విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫలితాన్ని చూస్తుంటే ఆడియన్స్ రవితేజ సినిమాలపై నమ్మకాన్ని కోల్పోతున్నట్లు అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి రవితేజ అభిమానులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు యావరేజ్ సినిమాలను కూడా తన స్టామినాతో హిట్ చేసిన మాస్ రాజా.. ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను సైతం గట్టెక్కించలేకపోతున్నాడు. దాన్నిబట్టి ఆయన మార్కెట్ స్థాయి అర్థం అవుతుంది. నిజానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి చెడ్డ సినిమా కాదు.. ధమాకా తర్వాత రవితేజ నుంచి వచ్చిన బెస్ట్ సినిమా ఇదే.
పైగా సంక్రాంతి లాంటి పెద్ద పండుగ సీజన్, దానికి తోడు సినిమాకు డీసెంట్ టాక్ రావడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. ఈ చిత్రం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో విఫలమైంది. సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ప్రేక్షకులు తక్కువగా ఆసక్తి చూపిన చిత్రంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి నిలిచింది. పండుగ సెలవులను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. సాధారణంగా కంటెంట్ బాగోలేని చెత్త సినిమాలు ఫ్లాప్ అవ్వడం సహజం. కానీ ఒక డీసెంట్ సినిమాతో వచ్చి.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా రెవెన్యూ రాబట్టలేకపోతోంది అంటే.. సమస్య సినిమాది కాదు.. హీరో మీద ఆడియన్స్‌కు ఉన్న అభిప్రాయానిది అని అర్థం చేసుకోవాలి. గతంలో రవితేజ చేసిన వరుస రొటీన్ సినిమాలు, పరాజయాల ప్రభావం ప్రేక్షకుల మనసులో ఎంత బలంగా నాటుకుపోయిందో ఈ ఫలితం స్పష్టం చేస్తోంది.
దీనికి పూర్తి భిన్నంగా ఇదే సంక్రాంతికి వచ్చిన శర్వానంద్ చిత్రం నారి నారి నడుమ మురారి సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వాస్తవానికి శర్వానంద్‌కు కూడా గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. అయినా సరే ఆయన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాడు. కానీ మాస్ ఫాలోయింగ్ ఉన్న రవితేజ మాత్రం, మంచి టాక్ వచ్చినా ఆడియన్స్‌ను ఆకర్షించలేకపోవడం నిజంగా ఆయన కెరీర్‌కు డేంజర్ బెల్ లాంటిదే. అయితే రవితేజ లైనప్‌లో ఉన్న తదుపరి చిత్రాలు కొంత ఊరటను కలిగించేలా ఉన్నాయి. రాబోయే ఇరుముడి సినిమా, వివేక్ ఆత్రేయతో చేయబోయే ప్రాజెక్ట్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలు కంటెంట్ పరంగా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో వస్తున్న ఈ సినిమాలతోనైనా రవితేజ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటి.. పోగొట్టుకున్న ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటాడేమో చూద్దాం..!











